భారతీయ సినీ చరిత్రలో ఓపెనింగ్ రికార్డులన్నీ బ్రేక్
‘పుష్ప 2 : ది రూల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. రూ.1000 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం మొదటి రోజే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా తొలిరోజు ఈ రేంజ్‌లో కలెక్షన్లను వసూలు చేయలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ‘పుష్ప 2’ మొదటి రోజు రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్‌తో సహా వెల్లడించింది. సాధారణంగా తెలుగు సినిమాలకు ఉత్తర భారతదేశంలో పెద్దగా డిమాండ్ ఉండ దు.
కానీ 2021లో ‘పుష్ప’ సెట్ చేసిన రికార్డు అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆ రికార్డును కేవలం ఒక్క రోజులోనే ‘పుష్ప -2’ సినిమాతో సాధించింది అల్లు అర్జున్ టీమ్. ‘పుష్ప’ సినిమాతో రూ.100 కోట్లు రాబట్టడానికి కొంత సమయం పట్టింది. కానీ ‘పుష్ప -2’ సినిమాతో ఏకంగా తొలిరోజే రూ.72 కోట్లు రాబట్టడం ద్వారా భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. తమిళ్, కన్నడలో కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్, డే వన్ కలెక్షన్స్ మొత్తం కలుపుకొని 4.4 మిలియన్ డాలర్స్ రాబట్టింది. వివిధ సినిమాలకు రేటింగ్ ఇచ్చే మూవీ డేటా బేస్ వెబ్‌సైట్ ఐఎండీబీ ప్రకారం.. తొలిరోజు వసూళ్లలో ఇప్పటివరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ రూ.2౨3.5 కోట్ల వసూళ్లతో టాప్‌లో ఉండేది.
ఈ రికార్డును ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. రూ.214 కోట్లతో ‘బాహుబలి 2’ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’, ‘కేజీఎఫ్ 2’, ‘దేవర 1’, ‘లియో’, ‘ఆదిపురుష్’, ‘జవాన్’ ఉన్నాయి. తొలి ఐదు స్థానాల్లో తెలుగు సినిమాలే ఉండటం విశేషం. నైజంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం మొదటి రోజు రూ.23 కోట్లు వసూల్ చేయగా, ‘పుష్ప 2’ చిత్రం రూ.30 కోట్లు కలెక్ట్ చేస్తూ నైజాం రికార్డు కూడా తిరగరాస్తూ మొదటి స్థానంలో నిలిచింది. హిందీలో ఎన్నడూలేనివిధంగా టాప్ సినిమాగా రికార్డు సృష్టించింది. మొదటి రోజు రూ.72 కోట్ల కలెక్షన్లతో హిందీ సినిమా చరిత్రలోనే నూతన రికార్డ్ క్రియేట్ చేసింది. డే వన్ రికార్డులో ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే కాదు, తెలుగువారి కీర్తి కూడా పెంచే స్థాయిలో భారీ బ్లాక్ బుస్టర్ హిట్ కొట్టింది.






