5 August, 2026 | 4:46 PM

తల్లిపాలే శ్రీరక్ష: ఏసీడీపీఓ హరిత

05-08-2026 03:34 PM

నంగునూరు,(విజయక్రాంతి): పిల్లలకు తల్లిపాలే శ్రీరక్ష అని, పుట్టిన మొదటి గంటలోపు ముర్రుపాలు పట్టాలని ఏసీడీపీఓ హరిత అన్నారు. బుధవారం మండల పరిధిలోని మగ్దుంపూర్ లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను సర్పంచ్ పాకాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చి, ఆ తర్వాత రెండేళ్ల వరకు అనుబంధ ఆహారంతో పాటు పాలు కొనసాగించాలని ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.

క్రమం తప్పకుండా పిల్లల బరువు,ఎత్తులు చూయించుకోవాలని,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం ఆరు నెలలు నిండిన శిశువులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ రమాదేవి, ఉపసర్పంచ్ సామంతల లాస్య, కార్యదర్శి గౌతమ్, ఏఎన్‌ఎం మంజుల, ఆశ కార్యకర్త స్వరూప,సీఆర్పీ శిరీష, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, వసంత తదితరులు పాల్గొన్నారు.