calender_icon.png 26 November, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పడకేసిన ఆర్వో ప్లాంట్

26-11-2025 12:00:00 AM

  1. చోరీకి గురవుతున్న యంత్ర పరికరాలు

పట్టించుకోని అధికార యంత్రాంగం

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్25 విద్యార్థులకు,ప్రజలకు శుద్ధిజలం అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన రక్షిత త్రాగునీటి పథకం(ఆర్వో ప్లాంట్)నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారింది. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ పాఠశాల ఆవరణలోని ఒక ప్రత్యేక గదిలో అప్పటి పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ నిధులు రూ.3.40 లక్షలతో ఏర్పాటు చేసి సెప్టెంబర్ 2018లో ప్లాంట్ ప్రారంభించారు.

దీంతో రక్షిత త్రాగునీరు అందుబాటులోకి రానుందని విద్యార్థులు, స్థానికులు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ప్లాంట్ ప్రారంభించిన నెల రోజులకే అధికారులు పట్టించుకోకపోవడం, నిర్వహణ లోపంతో 6నెలలకే మూలన పడింది. ముందు చూపు లేకపోవడం, గ్రామ శివారులో ఏర్పాటు చేయడంతో పర్యవేక్షణ కరువైంది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని గది తలుపులు పగలగొట్టి అందులోని విద్యుత్ మోటర్లు,విలువైన యంత్ర పరికరాలను దొంగిలించుకుపోయా రు.

ఇట్టి విషయమై అప్పటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్వో ప్లాంటు నిరుపయోగంగా మారి 8ఏళ్లు పూర్తయినా అధికారులు మాత్రం పరిశీలించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలన పడిన ఆర్వో ప్లాంట్ ను గ్రామపంచాయతీకి అప్పజెప్పి గ్రామంలో ఏర్పాటు చేసి గ్రామస్తులకు మంచినీటిని అందించాలని ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు. 

ప్లాంటును అందుబాటులోకి తేవాలి  (నిమ్మల శ్రీకాంత్ గౌడ్ గ్రామస్తుడు తిమ్మాపురం) నిర్వాహన లోపంతో నిరుపయోగంగా మారిన ఆర్వో ప్లాంట్ ను సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇట్టి ప్లాంట్ ను గ్రామపంచాయతీకి అప్పజెప్పాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు శుద్ధి జలాలను ఉచితంగా అందించాలి.