రుణమాఫీపై బిఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం హాస్యాస్పదం : బీవీఆర్
కోదాడ,(విజయ క్రాంతి): రైతు రుణమాఫీపై బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపైన బిఆర్ఎస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తం అవుతుందని అది చూసి బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. గత బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయని లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి నాలుగు సంవత్సరాలు టైం తీసుకొని రైతులకు రుణమాఫీ చేయకుండా 10 శాతం ఉన్న సంపన్నుల కోసం పనిచేశారని ఎద్దేవా చేశారు.
సాంకేతిక లోపాల వల్ల కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదని రుణమాఫీ కానీ రైతులందరికి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.కావాలని బిఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించి వారి ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి లకే దక్కుతుందన్నారు. నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయ నూతన భవనంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలకు నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రికి ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు దున్న శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి వేపూరి సుధీర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొక్క బిక్షపతి, బాణాల నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






