28 July, 2026 | 3:39 PM

మంథని సీహెచ్‌సీలో 24 గంటల ప్రసూతి పీడియాట్రిక్ సేవలు

28-07-2026 03:08 PM

ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యుల నియామకం 

ప్రజలు సేవలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి

జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్

మంథని,(విజయక్రాంతి): మంథని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో ఇకపై 24 గంటల పాటు ప్రసూతి, చిన్నపిల్లల వైద్య సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండనున్నాయని పెద్దపల్లి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇటీవల నిర్వహించిన వైద్యుల నియామకాల్లో భాగంగా మంథని సీహెచ్‌సీకి ముగ్గురు స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు తెలిపారు.

నియమితులైన స్పెషలిస్ట్ వైద్యులు

డా. మామిడిపల్లి స్రవంతి, గైనకాలజిస్ట్, డా. గుంట మౌనిక,  అనస్తీషియా స్పెషలిస్ట్, డా. నరేష్, పీడియాట్రిషన్ ఈ నియామకాలతో మంథని సీహెచ్‌సీలో ప్రసూతి సేవలు, నవజాత శిశువులు మరియు చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు ఇకపై ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. మంథని నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ మెరుగైన వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన, ఉచిత వైద్య సేవలను పొందాలని డా. కె. శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.