శాసనమండలిలో బీఆర్ఎస్ వాకౌట్
- 22ఏ నిషేధిత భూములపై చర్చకు పట్టు
- వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్
- ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాటపాడుతూ నిరసన
- సీట్లో కూర్చొని పాడుకోమన్న గుత్తా సుఖేందర్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): శాసనమండలి నుంచి గురువారం బీఆర్ఎస్(BRS) వాకౌట్ చేసింది. తమకు ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశమివ్వకపోవడంతో నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ శాసనసభా పక్షనేత సిరికొండ మధుసూదనాచారి(BRS Legislature Party Leader Sirikonda Madhusudhana Chary) తెలిపారు.
అంతకుముందు 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చించకుండా ప్రశ్నోత్తరాలను చేపట్టడంతో సభలో బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు తెలిపారు. ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పొడియం వైపు వెళ్లేందుకు పలు దఫాలు చేసిన ప్రయత్నాలను మార్షల్స్ అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారిని తమ స్థా నాల్లో కూర్చోవాలని కోరినప్పటికీ వినిపించుకోలేదు.
అక్కడే నిలబడి నిరసన రూపం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి, గోరేటి వెంకన్న ‘నిండా ముంచినవ్ కొడకా తెలంగాణను’ అంటూ పాట పాడుతూ చప్పట్లు కొడుతూ కాగితాలు చింపి విసిరేశారు. చైర్మన్ స్పందిస్తూ.... ‘దేశపతి గారూ...మీరు మీ వాళ్లను సీట్లో కూర్చొబెట్టుకుని పాటపాడుకోండి’ అంటూ బదులిచ్చారు. ఒకవైపు ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇతర సభ్యులు ప్రశ్నలు వేయడం, వాటికి మంత్రులు సమాధానిలిస్తున్న సమయంలోనూ బీఆర్ఎస్ సభ్యు లు పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ నిరసనను కొనసాగించారు.
తమ నేత మధు సూదనాచారికి మాట్లాడేందుకు అవకాశమివ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరగా, ప్రశ్నో త్తరాలపై మాట్లాడిన తర్వాత మైక్ ఇస్తానని చైర్మన్ స్పష్టం చేశారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ 22ఏ నిషేధిత భూ ములపై చర్చించాలని కోరారు. దీనికి చైర్మన్ స్పందిస్తూ వాయిదా తీర్మానంపై తర్వాత మాట్లాడుదామని, ముందుగా ప్రశ్నోత్తరాలను పూర్తి చేద్దామని చైర్మన్ సూచించారు. ఇందుకు అంగీకరించని మధుసూదనా చారి తాము వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
అభివృద్ధిపై చర్చలో భాగస్వాములు కండి
బీఆర్ఎస్ సభ్యుల నిరసన సందర్భంగా వారికి నచ్చజెప్పేందుకు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రయత్నించారు. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు ‘జై తెలంగాణ, జైజై తెలంగాణ’ అంటూ సభలో నినాదాలు బిగ్గరగా చేశారు. దీంతో చైర్మన్ స్పందిస్తూ పార్లమెంటులో తాను, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ ఎంపీలుగా ఉన్నప్పుడు ‘ఇలా నినాదాలు చేసే తెలంగాణ తెచ్చాం’అని గుర్తుచేశారు. ప్రస్తుతం తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు భాగస్వాములు కావాలని వారికి ఆయన సూచించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ఆ నినాదాలను ఆపేసి తిరిగి చప్పట్లు కొడుతూ పాట పాడుతూ నిరసనను కొనసాగించారు. అనంతరం వాకౌట్ చేశారు.