calender_icon.png 20 July, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరాయలొద్దిలో బౌద్ధుల తావు!

20-07-2025 12:21:53 AM

  1. దేశంలో ఎక్కడా లేని చతుర్ముఖ బుద్ధబ్రహ్మ విగ్రహం గుర్తింపు 
  2. దానికి సింగపూర్, థాయ్‌లాండ్, సింధూ ప్రాంతాల్లోని బుద్ధవిగ్రహాలకు పోలిక 
  3. సన్యాసుల మఠం, మునుల గుహ, బౌద్ధుల వస్సావాసం, స్తూపాలూ గుర్తింపు 
  4. బయటపడిన రెండో శతాబ్దంనాటి లజ్జాగౌరి విగ్రహం 
  5. మోయతుమ్మెదవాగు పక్కన గుట్టపై బౌద్ధధార్మిక క్షేత్రం
  6. పర్యాటకానికి నోచుకోని అపురూప ప్రాంతం

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి, కూరెల్ల నడుమ ఉన్న సింగరాయలొద్దిలో దాగి ఉన్న బౌద్ధ చరిత్ర అత్యంత ఆసక్తికరంగా ఉంది. మోయతుమ్మెద వాగు(పెద్దవాగు) పక్కన దక్షిణాన సుమారు 200 అడుగుల ఎత్తున్న సింగరాయగుట్టలో బయటపడిన అపురూపమైన బౌద్ధుల తావు ఈ ప్రాంత విశిష్టతను చాటుతోంది. ఇక్కడ వేల ఏండ్ల నాటి అత్యంత విశిష్టమైన పురాతన సున్నపురాతి నాలుగు తలల బుద్ధబ్రహ్మ విగ్రహం ఉన్నది.

దీంతోపాటు లజ్జాగౌర్ (మాతృదేవత) విగ్రహం లభించింది.. బౌద్ధ స్తూపాలు, సన్యాసుల మఠం, మునుల గుహ, వస్సావాసం, మట్టి ఒరల బాయి, గుట్ట మీద నుంచి నీళ్లు కిందికి వెళ్లేందుకు నిర్మించిన ఒర్రె, ఇటుకల ఆనవాళ్లు ఇక్కడ దొరకడం చరిత్ర పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇది బౌద్ధమతంలో ప్రబలమైన హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాలకు పరివర్తన చెందిన కాలంలో నిర్మించిన బౌద్ధధార్మిక క్షేత్రమై ఉంటుందని చరిత్రకారులు భావిస్తున్నారు.

దీనినిబట్టి అప్పట్లో బౌద్ధ భిక్షువులు కాశీ నుంచి అమరావతి, పుష్పగిరి, రామేశ్వరం మీదుగా శ్రీలంక వెళుతూ లక్షల సంఖ్యలో కాలినడకన వస్తూ ఇక్కడి సింగరాయలొద్దిలోని బౌద్ధప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవారని తెలుస్తోందని అంటున్నారు. బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యానమందిరాలు, భిక్షువులు గుట్టపై ఉపయోగించిన నీళ్లతోపాటు వానకాలంలో వరదనీరు కిందికి వెళ్లేందుకు నిర్మించిన ఒర్రె, వాళ్లు ఉపయోగించిన రోలు లాంటివి ఇక్కడ ఉన్నాయి.

 50 అడుగుల వ్యాసంతో ఇటుకల వృత్తం

 ఏడో శతాబ్దంలో బౌద్ధ, జైనమతాల స్తూపాలు, చైత్యాలు, బసదులు, విహారాలమీద కాలాముఖులవంటివారు దాడులు చేసి ధ్వంసం చేసి, హిందూ దేవాలయాలుగా మార్చినట్టుగానే ఇక్కడ కూడా దా డులు జరిగినట్టు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. నాలుగు తలల బుద్ధబ్రహ్మ విగ్రహానికి ఎదురుగా 50 అడుగుల వ్యాసంలో ఇటుకల వృత్తం ఉన్నది. ఆ ఇటుకల కొలతలు 14.8.4 అంగుళాలున్నాయి.

కొన్ని ఇటుకలు 20 అంగుళాల పొడవు ఉన్నాయి. ఆ ఇటుకలు జారిపోకుండా వాటి చుట్టూ రాళ్ల అంచు ఉన్నది. పలుచని కుండ పెంకులు, నునుపుదేరిన నూరేరాయి, రాతి పలకలు, స్తూపం మధ్యలో అడుగున పునాది కోసం వాడే వృత్తాకారపు రాతి ముక్క పూర్తిగా శిథిలమై ఉన్న నల్లరాతిస్తంభాలు ఉన్నాయి. గుప్తనిధుల కోసం తవ్విన గుంతల్లో ఇటుక గోడల జాడలు కనిపిస్తున్నాయి.

ఈ ఇటుకల వృత్తం నడుమ కూలిపోయిన గుడి స్తంభాలు ఉన్నాయి. గుడికి సంబంధించిన రాళ్లు ఉన్నాయి. కొత్తగా చతురస్రాకారంలో ఉన్న పానవట్టంలో బాణలింగం వంటిది పెట్టే ప్రయత్నం చేశారు. దానికి సుమారు వంద అడుగుల దూరంలో ఉన్న ఆంజనేయుడి విగ్రహం వద్ద 20 అడుగుల వ్యాసమున్న మట్టిఒరలబాయి ఉన్నది. 

 నాలుగుతలల బుద్ధబ్రహ్మ 

స్తూపాలు, చైత్యాల్లోని శిల్పాలకు కూడా బౌద్ధులు సున్నపురాయిని వాడారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. సింగరాయలొద్దిలో ఉన్న నాలుగు తలల బుద్ధబ్రహ్మ శిల్పాన్ని విశిష్టమైన రీతిలో మలిచారంటున్నారు. రెండు అడుగుల ఎత్తున్న ఈ శిల్పానికి రెండు చేతులు, చక్కని జటామాలకంతో నాలుగుతలలు, కనుపాపలు కనిపించని మీననేత్రాలు, ధోతి వంటి అధోశాటిక, నడుమునకు రత్నాలపట్టి, దండరెట్టలు, ముంజేతులకు కట్టిన ఆభరణాలు, పెద్ద చెవులకు పెద్ద కుండలాలు, రెండు వరుసల కంఠహారాలతో అలంకరించి ఉన్నది.

అభయముద్రలో ఉన్నట్టుగా భావిస్తున్న కుడిచేయి విరిగిపోయి ఉన్నది. ఎడమచేతిలో సన్నని మెడ ఉన్న పాత్ర(కమండలం) ఉన్నది. ఈ శిల్పాకృతిని పోలి ఉన్న బుద్ధుడి విగ్రహాలు నాలుగు తలలు, నాలుగు లేదా ఆరు చేతులతో నిలబడిన, కూర్చున్న స్థితులలో బుద్ధుడి శిల్పాలు సింగపూర్, థాయ్ లాండ్ వంటి బౌద్ధమతం ఆదరింపబడుతున్న దేశాల్లో ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

పాకిస్తాన్ లోని సింధు ప్రాంతంలోని మీర్పూర్ ఖాస్ సమీపంలో గుప్తుల కాలానికి చెందిన క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన నాలుగుతలల బుద్ధబ్రహ్మ విగ్రహానికి సింగరాయలొద్దిలో ఉన్న శిల్పానికి దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు. వజ్రయాన బౌద్ధంలో బకబ్రహ్మ (మజ్జిమనికాయ), బ్రహ్మ సహంపాతి (సంయుత్త నికాయ), బ్రహ్మ సనత్కుమార (జానవసభ సుత్త), మహాబ్రహ్మ (బ్రహ్మజల సుత్త) అనే నలుగురు ఆరాధించబడ్డారన్నారు.

అందులో బ్రహ్మసహంపా తిని పోలి ఉన్నదే సింగరాయలొద్దిలోని నాలుగుతలల బుద్ధబ్రహ్మ  విగ్రహమన్నారు. బ్రహ్మకు ప్రత్యేకంగా విగ్రహం పెట్టిన చైత్యాలున్న ట్టు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదని, బాలిద్వీపంలో బ్రహ్మ  విహారముందన్నారు. బ్రహ్మ విహారమం టే బౌద్ధంలో అత్యుత్తమ భావనాస్థితి అని అన్నారు.

బౌద్ధ విహారంలో బుద్ధబ్రహ్మను ప్రతిష్టించింది ఒక్క  సింగరాయలొద్దిలోనే కావొచ్చన్నారు. అందుకే ఇది బౌద్ధానికి అపురూపమైన తావు అని చెప్పారు. ఇంతటి అత్యంత విశిష్టత ఉన్న నాలుగు తలల బుద్ధబ్రహ్మ విగ్రహం ఇక్కడ మట్టిలో నిరాదరణగా పడి ఉన్నది.

 ఇటుకలు బౌద్ధ స్తూపానివే..

సింగరాయలొద్దిలోని ఇటుకల నిర్మాణం బౌద్ధ స్తూపానికి చెందినదే. అని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలోని సాంచీ స్తూపం తర్వాత దక్షిన భారతదేకశంలో అంతటి విశిష్టత ఈ స్తూపానికి ఉందని భావిస్తున్నారు. పక్కన ఉన్న ఇటుక కట్టడాలు చైత్య, విహారాలై ఉండొచ్చంటున్నారు. ఈ గుట్ట దిగువన బండరాళ్లు, మట్టితో పడిగెరాయి కింద కట్టిన సత్రాన్ని కూడా చరిత్ర పరిశోధకులు కనుగొన్నారు.

అక్కడ రాతిపడక కూడా ఉన్నది. ఇక్కడి నుంచి మోయతుమ్మెద వాగుకు తూర్పు దిక్కున అవతలి ఒడ్డున కిలోమీటరు దూరంలో సన్యాసుల మఠం, మునుల గుహ అని పిలిచే బౌద్ధుల వస్సావాసం(వర్షావాసం) ఉన్నది. బౌద్ధ భిక్షువులు వానకాలంలో నాలుగు నెలలు బయట పర్యటించకుండా చాతుర్మాస వ్రత దీక్ష చేసేందుకు ఈ క్షేత్రాన్ని ఉపయోగించుకునేవారని చరిత్రకారులు అంటున్నారు.

దీనికి తలాపున గట్టుమీద దమ్మకుంట ఉన్నది. ఈ గుట్టకు వెనుక వైపున ధరుసాగరపల్లె ఉన్నది. అక్కడ మట్టికోట ఉన్నది. సింగరాయలొద్దికి దగ్గరనే నాగసముద్రాల ఉన్నది. ఆ ఊరిలో బౌద్ధనాగార్జునాచార్యుడు నివసించినట్టు గ్రామస్తులు చెప్పుకుంటారు.

 పట్టించుకోని పురావస్తు శాఖ

సింగరాయలొద్దిలో బౌద్ధుల ఆనవాళ్లు దొరకడంతోపాటు అక్కడ బుద్ధబ్రహ్మ విహారం, బౌద్ధారామాలు, స్తూపాలు ఉన్నట్టు చరిత్రకారులు రుజువులు చూపిస్తున్నా పురావస్తు శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. అక్కడ అడవిలో ఎలాంటి రక్షణ లేకుండా పడి ఉన్న అత్యంత విశిష్టమైన నాలుగుతలల బుద్ధబ్రహ్మ విగ్రహాన్ని మ్యూజియంలోకి చేర్చడంలేదు. దీంతో కొందరు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు. దానికి చందనం రంగు వేసి రూపాన్ని చెరిపేస్తున్నారు.

సింగరాయలొద్దిలో లభించిన ఆధారాలతో ఈ ప్రాంతం బౌద్ధధర్మం హీనయానం నుంచి మహాయాన, వజ్రయానాలకు పరివర్తన చెందిన కాలంలో బౌద్ధ ధార్మిక కేంద్రంగా ఉండేదని స్పష్టమవుతోంది. ఈ ప్రాంతంలో మరిన్ని పరిశోధనలు జరిపితే బౌద్ధ చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పరిరక్షించి, దీనిని బౌద్ధ చరిత్రకు సంబంధించిన పర్యాటక కేంద్రంగా మార్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

సింగరాయ పేరుతో జాతర

అంతకుముందు అక్కడ ఉన్న బౌద్ధస్తూపాలను కూల్చేసి గుడి కట్టి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. గుడి స్తంభాలు 8వ శతాబ్దానికి చెందినవని, అవి రాష్ట్రకూటశైలిలో ఉన్నాయంటున్నారు. కూలిన గుడి పైభాగంలో భైరవుడి విగ్రహం ఉన్నది. ఆపైన గుట్టమీద కొసన బండసొరికెలో నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య(మాఘ అమావాస్య) నాడు సింగరాయ పేరుతో జాతర జరుగుతుంది. ఇక్కడి మోయతుమ్మెదవాగులో స్నానాలు చేసి వంకాయకూర, పచ్చిపులుసుతో నైవేథ్యాలు పెట్టి మొక్కుకుంటారు. ఈ ఆచారం బౌద్ధులదే అని చరిత్రకారులు అంటున్నారు.

మాతృదేవత ఆరాధనను తెలిపే లజ్జాగౌరి

సింగరాయలొద్దిలో లజ్జాగౌరి విగ్రహం కూడా బయటపడింది. 5 అంగులాల పొడవు, వెడల్పుతో సున్నపురాయిమీద ఈ అమ్మదేవత విగ్రహం చెక్కి ఉన్నది. సింగరాయ తీర్ధం కోసం గుట్టపై చదును చేస్తుండగా బయటపడిన ఇటుకలపోగులో ఈ శిల్పం దొరికింది. ఇక్కడ బౌద్ధ స్తూపం ఇటుకల పరుపు అడుగున దొరకడంతో ఇటుకల సైజును బట్టి ఈ మాతృదేవతా విగ్రహం క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినదై ఉంటుందని కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.

ఈ మాతృదేవతా శిల్పం సాంచీ స్తూపంలో బయటపడ్డ మాతృదేవతా రూపానికి భిన్నమైనదన్నారు. ఇలాంటి విగ్రహాలు దేశంలో చాలాచోట్ల బయటపడ్డాయని, వీటిని లజ్జాగౌరి విగ్రహాలంటారన్నారు. సింగరాయలొద్దిలో దొరికిన శిల్పంలో తలభాగం ఎడమవైపు కొంత శిథిలం కావడంతో విగ్రహ స్వరూపం పూర్తిగా కనిపించడం లేదన్నారు.

అయితే విగ్రహం మాతృదేవతా రూపమేనని, అంతకన్నా ప్రాచీనమైందన్నారు. ఈ విగ్రహం తెలంగాణలో తొలినాళ్ల మాతృదేవతారాధనకు ఒక ఆధారంగా ఉందన్నారు. వీటన్నిటిని బట్టి సింగరాయలొద్ది బుద్ధధర్మానికి ఆరామమని నిస్సందేహంగా చెప్పొచ్చని హరగోపాల్ అన్నారు.

- మేకల ఎల్లయ్య, 

హుస్నాబాద్ (విజయక్రాంతి)