మిషన్ భగీరథ నీటిలో వాన పాములు..!
భయాందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
బిజినేపల్లి: మండలంలోని అల్లీపూర్ గ్రామంలో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీటిలో వానపాములు వస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఇంటిటి బిందెల్లోకి వచ్చే నీటిలో వానపాములు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు.
కొందరు ప్రజలు భయంతో ఈ సమస్యను కూడా మౌనంగా భరిస్తున్నట్లు సమాచారం. మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో లోపాలపై మండంలోని వెల్గొండ గ్రామ సర్పంచ్ నాగోల్ నాగిరెడ్డి గతంలో పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. తాగునీటి విషయంలో వెంటనే చర్యలు తీసుకుని పైప్‌లైన్లు, నిల్వ ట్యాంకులను పరిశీలించి శుద్ధి చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






