calender_icon.png 5 February, 2026 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీడ కోసం నిరీక్షణ!

05-02-2026 12:00:00 AM

బస్‌షెల్టర్ లేక ప్రయాణికుల పాట్లు

నిలువ నీడ లేదు.. కూర్చునే పరిస్థితి లేదు

మండుటెండలో ప్రయాణికుల పడిగాపులు

తాత్కాలిక ఏర్పాట్లయినా చేయాలంటున్న ప్రజలు

మణుగూరు, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు, వేల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు. కానీ ఇక్కడ ప్రయాణికుల కోసం ఒక్క బస్ షెల్టర్ అయినా కనిపించదు. పారిశ్రామిక ప్రాంతమైన  మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిలువ నీడ లేక పాట్లు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుండటంతో ఎండ వేడిమికి ప్రజలు తట్టుకోలేక అల్లాడుతున్నారు. మరోవైపు ప్రయాణికులు నిలువ నీడ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండే ఎండలోనే నిలువ నీడ లేక బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణ దుకాణాల ఎదుట, చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. మండల కేంద్రంలో ప్రయాణికుల కష్టాలపై విజయక్రాంతి కథనం...

అధికారుల పట్టింపేదీ?

మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన  బస్ షెల్టర్ ను గత కొన్నేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనులు భాగంగా తొలగించారు. నాటి నుండి నేటి వరకు బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు లేక ఎండలోనే చంటి పిల్లలతో ప్రయాణికులు గంటల తరబడి  వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.  కొన్ని  నెలల క్రితం  ఉన్న చోట్ల బస్ సెంటర్ నిర్మాణం అంటూ  హడావుడి చేసిన పాలకులు మళ్లీ ఆ విషయాన్ని పక్కన పెట్టడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు.

ఎన్నాళ్లీ దుస్థితి..?

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆర్టీసీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై శ్రద్ధచూపడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. దీనికి తోడు మండలాల్లో ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు లేక మండు టెండలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

తాత్కాలిక ఏర్పాట్లయినా చేయాలంటున్న ప్రజలు...

గతంలో అంబేద్కర్ సెంటర్ లో బస్సు షెల్టర్ ఉండేది. రోడ్డు విస్తరణతో దానిని తొలగించడంతో  అప్పటి నుంచి ప్రయా ణికులకు కష్టాలు తప్పడంలేదు,అక్కడే బస్ షెల్టర్ ను నిర్మించాలని ప్రజలు అనేక మార్లు అధికారులకు, పాలకులకు మొర పెట్టుకున్న కార్యరూపం దాల్చడంలేదు. ఇప్పటికైనా స్పందించి  బస్ షెల్టర్తో  పాటు మరుగుదొడ్లు, టాయిలెట్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.