ముంబైలో బస్సు బీభత్సం
- జనాలపైకి దూసుకెళ్లిన బస్సు
- ఏడుకు చేరిన మృతుల సంఖ్య
- 40 మందికి పైగా గాయాలు
ముంబై, డిసెంబర్ 10: ముంబై మహానగరంలో సోమవారం రాత్రి ఘోర ప్రమా దం చోటుచేసుకున్నది. ఓ బస్సు వేగంగా వెళ్తూ అదుపు తప్పి పాదచారుల పైకి దూసుకెళ్లింది. వాహనాలను ఢీకొడుతూ బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం నాటికి మరో ముగ్గురు మృతిచెందారు.
నగరంలోని కుర్లా నుంచి బృహన్ ముంబై ఎల క్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సింగిల్ డెక్కర్ బస్సు ప్రయాణికులతో అంధేరి రైల్వేస్టేషన్‌కు బయల్దేరింది. బార్వే రోడ్‌కు వచ్చే సరికి బస్సు అదుపు తప్పి జనంలోకి దూసుకెళ్లింది. పదుల సంఖ్యలో వాహనాలను తో సుకుంటూ వెళ్తూ అంబేడ్కర్ హౌసింగ్ కాం ప్లెక్స్ ద్వారాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై శివమ్ కశ్యప్ (18), కనీజ్ అన్సారీ (55), అఫ్రీన్ షా (19), అనమ్ షేక్ (20) అక్కడికక్కడే మృతిచెందారు.
మరో 40 మందికి పైగా గాయ పడ్డారు. ఆరు ఆటోలు, పది వరకు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ సంజయ్‌మోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్విక్ రెస్పాన్స్ బృందం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సాయంతో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మరో ముగ్గురు మృతిచెందారు.
డ్రైవ ర్ మద్యం తాగి బస్సు నడిపాడా.. అన్న అనుమానంతో పోలీసులు అతడికి వైద్యపరీక్షలు చేయించారు. బ్రేక్‌కు బదులు యాక్సి లేటర్ తొక్కడంతోనే ప్రమాదం సంభవించిందని గుర్తించారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డీసీపీ గణేశ్ వెల్లడించారు.
ఉద్యోగానికి వెళ్లిన తొలిరోజే మృత్యు ఒడికి..
ముంబైకి చెందిన ఆఫ్రీన్ షా (19) ఇటీవల మంచి కొలువు సంపాదించింది. సోమవారం ఆమె ఉద్యోగంలో తొలిరోజు. కానీ.. అదే ఆమె చివరి రోజు అవుతుందని కుటుంబ సభ్యులు ఊహించలేదు. ఆఫ్రీన్‌షా ఉత్సాహంగా ఆఫీసుకు వెళ్లి, విధులు ముగించుకుని రాత్రి బయటకు వచ్చింది. తన తండ్రికి కాల్ చేసి.. ‘నాన్న ఇంటికి వచ్చేందుకు ఇక్కడ ఆటోలు లేవు’ అని చెప్పింది.
దీంతో తండ్రి సలీం ఆమెను కుర్లా స్టేషన్ వద్ద బస్సు ఎక్కాలని సూచించాడు. కొద్దిసేపటి తర్వాత తండ్రి మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి.. ‘మీరు వెంటనే ఆసుపత్రికి రావాలి’ అని సూచించాడు. దీంతో తండ్రి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. తీరా చూస్తే అక్కడ తన కుమార్తె ఆఫ్రీన్‌షా విగతజీవిగా కనిపించింది. దీంతో సలీం కుప్పకూలిపోయాడు. గుండెలవిసేలా రోదించాడు.






