23న యాదాద్రిలో క్యాబినెట్ భేటీ?
- 21న సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా?
- అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాల ఆరంభం
- అక్కడే సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తర్జన భర్జన
- మంత్రుల కాళేశ్వరం పర్యటన ఉండటంతో పునరాలోచన
హైదరాబాద్/యాదగిరిగుట్ట, మే 19 (విజయక్రాంతి): మంత్రివర్గ సమావేశ నిర్వహణ విషయంలో రాష్ట్రప్రభుత్వం తర్జన భర్జ న పడుతున్నట్లు తెలుస్తున్నది. సర్కార్ ము నుపటి నిర్ణయం ప్రకారం ఈనెల 21న మం త్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. అదే భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలో 21న సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రా రంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో గతం లో మేడారం జాతర ఆరంభం రోజు నిర్వహించినట్లే, సరస్వతి అంత్య పుష్కరాల ఆరంభం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సర్కార్ భావించింది. కానీ, మంత్రులంతా పుష్కరాల పనుల్లో నిమగ్నమవ్వడం, అదేరోజు వారి కాళేశ్వర పర్యటన అడ్డంకిగా మారుతుందేమోనని సర్కార్ తర్జ న భర్జన పడుతున్నది. ఇలాంటి సందిగ్ధావస్థలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయడమే సమంజసమని నిర్ధారణకూ వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.
అయితే.. ఈ నెల ౨౩న యాదాద్రి నృసింహుడి ఆలయ సన్నిధిలో వేద పాఠశాల ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో, అదే రోజు అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం నుంచి నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పాలనా వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ, హైదరాబాద్ కాకుం డా ఇతర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం సీఎంకు కొత్తేమీ కాదు. మేడారం జాతర సందర్భంగా అక్కడ మంత్రివర్గ సమావేశం నిర్వహించి, సీఎం అక్కడికక్కడే జాతర ఏర్పాట్లు, నిధుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకుని కొత్త సంస్కృతికి నాంది పలికారు. అదే స్ఫూర్తితో మళ్లీ యా దాద్రిలో మంత్రివర్గ సమావేశం నిర్వహించి, ఆలయ అభివృద్ధితోపాటు స్థానిక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
యాదగిరిగుట్టలో ఈ నెల 23న సీఎం రేవంత్‌రెడ్డి రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు యాదగి రిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవానీ శంకర్ తెలిపారు. సీఎం ఈ నెల 23న ఉదయం 9.27 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారని, అభి వృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. టెంపుల్ సిటీ నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన కార్య క్రమంలో కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పాల్గొంటా రని చెప్పారు.
దేవస్థానం కొండపైన నూతనంగా కళ్యాణమంటపం, దీక్షాపరుల సద నం, కొండ కింది నుంచి కొండపై వరకు మె ట్ల దారి వెంట పైకప్పు షెడ్డును నిర్మించడం, పిఆర్‌ఓ ఆఫీస్ ఎదురుగా నూతనంగా మాడవీధులకు వెళ్లేందుకు మెట్ల మార్గం (ఎక్సలే టర్) వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్‌రెడ్డి, కంచి పీఠాధిపతి శంకరా విజయేంద్ర సరస్వతితో కలిసి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఈ నెల 22న లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. స్వామి వారిని దర్శించు కున్న అనంతరం కొండపైన కళావేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు భజన కార్యక్రమంలో పాల్గొంటారని, 32 మంది చతు ర్వేద పారాయణం ఉంటుందన్నారు.






