19-02-2026 12:03:09 AM
ప్రొఫెసర్ హరగోపాల్
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తేనే వలసలకు చెక్..
షాద్‌నగర్ సదస్సులో మేధావుల పిలుపు
షాద్‌నగర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో.. పాలమూరు జిల్లాకు మాత్రం అడుగడుగునా అన్యాయమే జరుగుతోందని ప్రముఖ మేధావి ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్లో ‘లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఎందుకు చేపట్టడం లేదు?’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నది పాలమూరు జిల్లా గుండా ప్రవహిస్తున్నప్పటికీ, జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందకపోవడం దురదృష్టకరమని హరగోపాల్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తామని అన్ని పార్టీల నేతలు హామీలిచ్చారే తప్ప, ఆచరణలో శూన్యమని విమర్శించారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ డిజైన్లను మార్చి కాలయాపన చేసిందని, అధికారంలోకి వస్తే పనులు పూర్తి చేస్తామన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చొరవ చూపడం లేదని దుయ్యబట్టారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తేనే ఈ ప్రాంతంలో వలసలు ఆగుతాయని, లేనిపక్షంలో తీవ్ర నీటి కరువు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని కాలువల ద్వారా నల్గొండకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రజలు గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవిపల్లి సాధన కోసం ’పాలమూరు అధ్యయన వేదిక’ చేస్తున్న పాదయాత్రలు, పోరాటాలకు అందరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ సదస్సులో ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త డి.నరసింహారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తిరుమలయ్య, రవీంద్రనాథ్, అర్జునప్ప, టీజీ శ్రీనివాస్, మందారం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.