జీవన్‌రెడ్డి మాల్ లీజు రద్దు
బకాయిలు చెల్లించకపోవడంతో స్వాధీనం
అనేక నోటీసులిచ్చినా స్పందించని లీజుదారు
హైకోర్టు ఆదేశాల మేరకు లీజు రద్దు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
నిజామాబాద్, మే 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని జీవన్‌రెడ్డి మాల్ లీజును ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఆర్టీసీ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించనందున హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొ న్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీకి చెందిన 7,059 చదరపు గజాల స్థలాన్ని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్‌కు 33 ఏండ్లకు ఆర్టీసీ లీజుకు ఇచ్చింది.
అయితే, సంస్థ స్థలంలో షాపింగ్ మాల్ నిర్మించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కుటుంబం.. ఆర్టీసీకి అద్దె చెల్లించపోవడంతో 2013 నుంచి అనేక సార్లు నోటీసులు జారీచేసింది. అయినా స్పందించకపోవడంతో గురువారం మాల్‌ను స్వాధీ నం చేసుకుంది. ఉదయం జీవన్‌రెడ్డి మాల్ కు చేరుకున్న ఆర్టీసీ అధికారులు, మాల్‌లోని దుకాణాల యజమానులకు నోటీసులు జారీచేశారు. నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సంస్థకు బకాయిలు చెల్లించకపోవడంతో మాల్‌ను స్వాధీనం చేసుకుంటున్నట్టు స్పష్టంచేశారు.
థర్డ్ పార్టీ వ్యక్తులకు లీజు
విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ 33 ఏండ్లకు లీజుకు తీసుకున్న ఆర్టీసీ స్థలంలో జీవన్‌రెడ్డి సతీమణి రజితారెడ్డి టేకోవర్ చేసుకుని మాల్ నిర్మాణం చేపట్టారు. దానికి జీవన్‌రెడ్డి మాల్ అని పేరు పెట్టారు. మాల్‌లో థర్ట్ పార్టీ వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. మాల్‌కు గత ఏడాది వరకు 8.65 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నోటీసులు జారీ చేయడంతో గత అక్టోబర్‌లో రూ.1.50 కోట్లు, డిసెంబర్‌లో విడతల వారీగా రూ.2.40 కోట్లను చెల్లించారు. తమకు సమయం కావాలంటూ లీజుదారు హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మరో రూ.౨ కోట్లను చెల్లించారు. లీజుదారు మరోసారి గడువు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇది ప్రజల ఆస్తి అని, బకాయిలన్నింటిని మార్చి 27లోగా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. లేదంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోలని సూచించింది. ఇప్పటికీ రూ.2.51 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు లీజుదారుకు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి, అధికారులు మాల్‌ను స్వాధీనం చేసుకున్నారు.




