కొత్త వంగడాలకు కేరాఫ్ బసంత్‌పుర్
చెరుకు, గోధుమ పంటలపై శాస్త్రవేత్తల పరిశోధన
యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన
విభిన్న పంటల కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు
జహీరాబాద్, మే 15 : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రామ శివారులోని ఉన్న ప్రొ. జయశంకర్‌సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్‌గా నిలిచింది. ఈ కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు అనునిత్యం పంటలపై పరిశోధనలు చేస్తూ అధిక దిగుబడులను సాధించేలా కృషి చేస్తున్నారు.
పరిశోధన కేంద్రంలో ఆధునిక యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానంతో మేలు రకమైన విత్తనాలు, వంగడాలను తయారు చేసి రైతులకు అందజేస్తున్నారు. ఇక్కడ చేస్తున్న పరిశోధనలు పలు రాష్ట్రాల్లోని కంపెనీల యాజమాన్యాలు అక్కడి ప్రాంత రైతులను పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చి శిక్షణ కల్పిస్తున్నారు. అనతి కాలంలోనే శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలతో దేశంలోనే మామిడ్గి వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
చెరుకు, గోధుమ పంటలపై పరిశోధనలు
ఈ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఎర్రరాయి గుట్టలే.. ఎర్రరాయి ఉండడంతో ఇక్కడేమి పండుతుందని ప్రతి ఒక్కరూ అనుకునేవారు. ఆ ఎర్రరాయి నేలపైనే పరిశోధనలు చేసి పండించాలన్న సదుద్ధేశంతో 2010లో అప్పటి ప్రభుత్వం పట్టుదలతో 80ఎకరాల విస్తీర్ణంలో ఆచార్య ఎన్‌జీ రంగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు ఎర్రరాయి భూములను చదును చేయించి పంటలపై పరిశోధన చేయడం ప్రారంభించారు. ఈ భూముల్లో ఏం చేస్తారానే అనుకునే ఇక్కడి ప్రజలు ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి పంటలను పండించడంతో ముక్కున వేలుసుకుంటున్నారు.
స్థానిక పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో చెరుకు, గోధుమ, షుగర్‌బీట్ పంటలపై పరిశోధనలు చేస్తున్నారు. చెరుకులో దాదాపు 170 రకాల పరిశోధనలు చేశారు. ఈ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాలు ఎంపిక చేసి వాటిపై పరిశోధనలు చేసి రైతులకు అందజేశారు. వాటిలో 8005, 93వీ297, 83ఎ30, 86032, 9520, 87025 రకాల చెరుకు పంటను రైతులు పండిస్తున్నారు. అలాగే చెరుకు ప్రత్యామ్నాయంగా షుగర్‌బీట్ పంటపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు పండిస్తున్న చెరుకు కర్ర రూపంలో ఎత్తుగా ఎదుగుతుంది.
కానీ షుగర్ బీట్ మాత్రం భూమిలోపల దుంప రూపంలో పండుతుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్థానిక పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్త డా. విజయ్‌కుమార్ పర్యవేక్షణలో 8 రకాల షుగర్బ్రీట్ పంటపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క రకం ఒక్కో దిగుబడి ఇవ్వనుంది. త్వరలోనే షుగర్‌బీట్ పంటను పండించేందుకు అందుబాటులో తీసుకొచ్చేలా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. చెరుకు పంటపై తెలంగాణతో పాటు కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాలకు చెందిన షుగర్ ఫ్యాక్టరీ యాజమానులు అక్కడి ప్రాంత రైతులను ఈ పరిశోధన కేంద్రానికి తీసుకొచ్చి ఆధునిక వంగడాలు, యాంత్రీకరణపై అవగాహన కల్పించి తీసుకెళ్తుంటారు.
గోధుమ పంటపై ..
పరిశోధన కేంద్రంలో చెరుకు పంటపైనే కాకుండా గోదమ పంటలో కూడా పరిశోధలు చేస్తుంటారు. ఈ పంటలో 45 రకాలపైగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వాటిలో ప్రధానంగా డబ్ల్యూఆర్ 162, పీడీడబ్ల్యూ 533, అధిత్య, ఎంఎసీఎస్ రకాల గోధుమ పంట ఈ ప్రాంతంలో రైతులు పండించే వీలుగా తయారు చేశారు. రెండు, మూడు నీటి తడులతో తక్కువ కాల పరిమితిలో హెక్టర్‌కు 20, 30 క్వింటాలు దిగుబడి సాధించే విధంగా పరిశోధన చేశారు. ఈ పరిశోధన కేంద్రంలో చెరుకు, గోధుమ, షుగర్‌బీట్ పంటలపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధనలే కాకుండా రైతులు సాగు చేసే పంటలకు అశించే తెగుళ్లు, చీడపురుగుల నివారణ చర్యలు, ఆధునిక వ్యవసాయ, యాంత్రీకరణపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
చెరుకు, గోధుమ పంటలపై పరిశోధనలు
పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు కొత్త వంగడాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యంత్రీకరణ పద్ధతులను అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రధానంగా చెరుకు, షుగర్‌బీట్, గోధుమ పంటలపై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నాం. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా సాగు చేసేందుకు అవసరమయ్యే చెరుకు, గోధుమ పంటలపై పరిశోధన చేసి కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహ న కల్పిస్తూ అధిగ దిగుబడులు సాధించేలా కృషి చేస్తున్నాం.
డా. విజయ్‌కుమార్,
ప్రొ. జయశంకర్‌సార్ పరిశోధన కేంద్రం,
బసంతపూర్ (సంగారెడ్డి)




