అంతుచిక్కని ఓటరు నాడి
టెన్షన్‌లో నేతలు
కరీంనగర్, మే 15 (విజయక్రాంతి): గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 69.5 శాతం పోలిం గ్ నమోదు కాగా ఈసారి 72.51 శాతం నమోదయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఎవరికి ఓటేశామనే విషయంలో ఓటరు బయటపడగా, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సైలెంట్ ఓటింగ్ నడిచింది. దీంతో ఓటరు నాడి అంతుచిక్కక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పోలింగ్ జరిగిన నాటి నుంచి పార్టీ నేతలు, అనుచరులను పిలిపించుకొని లెక్కలు కట్టారు. తలో రీతిలో సమాధానం చెబుతుండడంతో ఓట్ల శాతం ఎంత వస్తుందో అన్నదానిపై స్పష్టతకి రాలేకపోయారు. ఎన్నికల్లో నిద్రాహారాలు మాని ప్రచారం చేసిన కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థులు, నేతలు ఉప శమనం కోసం తలోదారి పట్టారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుండడంతో జూన్ 1న తిరిగి కరీంనగర్‌కు చేరు కునే విధంగా ప్లాన్ చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పోలింగ్ జరిగిన మరుసటి రోజే అమెరికా పయనమయ్యారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కాశీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నందున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేం దుకు గురు వారం బయలుదేరి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు కాశీ విశ్వనాథున్ని దర్శించుకోనున్నారు. అలాగే బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ బుధవారం తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. మంగళ వారం వరకు అనుచరులతో సమావేశమై ఉపశమనం కోసం తన మకాంను ఫామ్‌హౌస్‌కు మార్చారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు కూడా రంగారెడ్డి జిల్లాలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. వీరితో పాటు ఎన్నికల ప్రచారంలో తలమునకలై పోలింగ్ వరకు అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన నేతలు విశ్రాంతి కోసం తలోదారి పట్టారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అలాగే చాలామంది నేతలు తిరుపతి, తదితర పుణ్య క్షేత్రాలతో పాటు తమ విశ్రాంతికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలకు వెళ్లారు.




