కారు బ్యాటరి పేలీ 23 కార్లు దగ్ధం

24-04-2024 01:57:19 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : కారు బ్యాటరీ పేలి సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే షోరూం పూర్తిగా దగ్ధమైన సంఘటన యూసుఫ్‌గూడలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఎస్సై రమ తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడలోని గణపతి కాంప్లెక్స్‌లో ‘నాని కార్స్’ సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే షోరూంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఓ సెకండ్ హ్యాండ్ కారులోని బ్యాటరీ పేలడంతో షోరూంలో ఉన్న 23కార్లతో సహా షోరూం దగ్ధమైంది. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజన్ వచ్చేలోపే కార్లు దగ్ధమయ్యాయి. వీటిలో 19కార్లు పూర్తిగా దగ్ధం కాగా, 4 కార్లు పాక్షికంగా దగ్ధమయ్యాయని పోలీసులు తెలిపారు. 23కార్లు ప్రైవేట్ డీలర్ల కార్లేనని, రూ. కోట్లలో నష్టం కలిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.