మోబైల్ కొట్టేద్దాం.. జల్సా చేసేద్దాం

27-04-2024 01:18:10 AM

నగరంలో మోబైల్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా అరెస్ట్

కటకటాల వెనక్కీ 17 మంది నిందితుల నుంచి రూ. 1.75 కోట్ల విలువైన 703 ఫోన్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన హైదరాబాద్  సీపీ శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : చీకటి పడితే చాలు ఆ ముఠా రోడ్డుపైకి వస్తుంది. ఒంటరిగా మనిషి కనబడితే చాలు ఆ ముఠా చుట్టుముడుతుంది. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్లను కొల్లగొడుతుంది. తెల్లవారగానే ఆ ముఠా నేరుగా జగదీశ్ మార్కెట్‌కు చేరుకొని అక్కడ సెల్‌ఫోన్ విడిభాగాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. దేశ, విదేశాలకు చెందిన 17 మంది ఒక ముఠాగా ఏర్పడి అంతర్జాతీయస్థాయి నెట్‌వర్కును మెంటేన్ చేస్తున్నారు. ఈ విషయంపై దృష్టి సారించిన హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ ముఠాలోని 17మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం కమిషనరేట్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. 17మంది నిందితులు మహ్మద్ ముజామిల్ అలియాస్ ముజ్జు(19), సయ్యద్ అబ్రార్ (19), సయ్యద్ సలీమ్(21), పఠాన్ రబ్బాని ఖాన్(34), మహ్మద్ అత్తర్(32), మహ్మద్ జాకీర్(35), షేక్ అజార్(31), మహ్మద్ ఖాజా నిజాముద్దీన్(49), సయ్యద్ లాయిఖ్(32), షేక్ అజార్ మొయినుద్దీన్(32), మహ్మద్ షఫీ (28), జె. ఎలమంద రెడ్డి (44), సూడాన్ దేశస్థులు.. ఖాలీద్ అబ్దేల్‌బాగీ మహమ్మద్ అల్బాడ్వీ(36), అబ్దేల్లా అహ్మద్ ఉస్మాన్ బాబికేర్(36), మహమ్మద్ సలీహ్ అబ్దుల్లా (34), అనాస్ సిద్దిగ్ అబ్దేల్‌గాడేర్ అహ్మద్ (24), ఒమేర్ అబ్దుల్లా ఎల్తాయబ్ మహ్మద్(27)ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 1.75కోట్ల విలువైన 703 సెల్‌ఫోను,్ల 1 పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నా మని తెలిపారు. అబిడ్స్‌తో పాటు నగరంలోని కొన్ని సెల్‌ఫోన్ సర్వీస్ దుకాణాల నిర్వాహకులతో ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ విడి భాగాలను, రిపేర్‌కి వచ్చినా ఇతర కస్టమర్ల ఫోన్లకు అమర్చుతూ డబ్బు సంపా దిస్తున్నారనీ, అలాగే నగరంతో పాటు దేశ, విదేశాల్లో వీరు నెట్‌వర్క్ ఏర్పరుచుకొని సెల్‌ఫోన్ల స్నాచింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. 

నిందితులు ఎక్కువగా బండ్లగూడ, ఫలక్‌నుమా, బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో  చోరీలు చేసినట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్‌లో చోరీ చేసిన ఫోన్లను, విడిభాగాల ను సూడాన్ దేశస్థులతో కలిసి ఇతర దేశాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిందన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌లో పట్టుబడిన నిందితుల్లో కొందరిపై ఇదివరకే నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సీపీ వివరించారు. అలాగే ఇతర పనుల నిమిత్తం ఇండియాకి వచ్చి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న సూడాన్ దేశస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.