26 April, 2026 | 1:59 PM

నటి అషురెడ్డిపై కేసు నమోదు

26-04-2026 12:21 PM

సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైంది. వివాహం పేరుతో రూ.9.35 కోట్లకు పైగా ఆర్థిక మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెపైనా, ఆమె కుటుంబంపైనా హైదరాబాద్ సీసీఎస్ లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. లండన్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వైవి ధర్మేంద్ర దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. సదరు నటితో తనకు దీర్ఘకాలిక సంబంధం ఉందని, 2018లో ధర్మేంద్ర హైదరాబాద్‌లో ఆషు రెడ్డిని మొదటిసారి కలిశానని,  అమెరికాలో తన చదువు పూర్తి చేసుకుని, ప్రస్తుతం భారతదేశంలో సినీ పరిశ్రమలో కెరీర్ కొనసాగిస్తున్నట్లుగా ఆమె తనను తాను పరిచయం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

మొదట వీరిద్దరి మధ్య  స్నేహం చిగురించిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని వెల్లడించారు. ఈ కాలంలో, ఆషు రెడ్డి తనను వివాహం చేసుకుంటానని మాటిచ్చారని ఫిర్యాదుదారు తెలిపారు.వివాహాన్ని సంప్రదాయబద్ధంగా చేయడానికి తాను ఆమె కుటుంబాన్ని కలిసినప్పడు, తనను తిరస్కరించారని ఆయన ఆరోపించారు. సుదీర్ఘ కాలం పాటు నిశ్చితార్థం కొనసాగిన తర్వాత, చివరకు ఆమె వివాహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిరాకరించిందని వాపోయ్యారు. ఇదే సమయంలో, ఆషు రెడ్డి సోదరి కూడా రూ.50 లక్షలు స్వీకరించారని మరో అదనపు ఆరోపణ చేశారు.

అంతేకాకుండా రూ.9.35 కోట్ల నగదు, రూ.9.5 కోట్ల విలువైన ఆభరణాలు, ఆస్తులు బదిలీ చేయబడ్డాయని, వాటిలో కొన్ని ఆమె పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నట్లు ఆషురెడ్డిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి చర్చలు, తంతులు జరిగినప్పటికీ వివాహం జరగలేదని కూడా ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు.  ఈ ఆరోపణలపై స్పందించిన ఆషు రెడ్డి, తాను ఎటువంటి తప్పు చేయలేదని తీవ్రంగా ఖండించారు. తప్పుడు, తప్పుదోవ పట్టించే నివేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా, తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేయబడుతోందని నటి పేర్కొన్నారు.