9 June, 2026 | 2:33 AM

బ్యాంకుల్లో నగదు కొరత?

09-06-2026 12:11 AM
  1. రూ.5 వేలు, రూ.10 వేలకే పరిమితమవుతున్న చెల్లింపులు
  2. అత్యవసర అవసరాలకు డబ్బులు  దొరక్క ప్రజల ఆందోళన
  3. ఆన్‌లైన్ లావాదేవీల పెరుగుదలతో నగదు కొరత అంటున్న బ్యాంకర్లు

మధిర, జూన్ 8 (విజయ క్రాంతి): మధిర పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో గత కొద్ది రోజులుగా నెలకొన్న నగదు కొరత ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో తగినంత సొమ్ము ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో నగదు పొందలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు అవసరమైన ఖాతాదారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది.

ప్రస్తుతం కొన్ని బ్యాంకులు రోజుకు ఒక్క ఖాతాదారుకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు మాత్రమే నగదు చెల్లిస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. అంతకుమించిన మొత్తాలను ఇవ్వడానికి నగదు అందుబాటులో లేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బులు కావాలంటే సంబంధిత వ్యక్తి లేదా సంస్థ ఖాతా నంబర్ ఇవ్వాలని, ఆర్టీజీఎస్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేస్తామని సూచిస్తున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.

అయితే ప్రతి చోట ఆన్లైన్ లావాదేవీలు సాధ్యం కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్య ఖర్చుల కోసం నగదు అవసరమైన సమయంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, చిన్న వైద్య కేంద్రాలు, ఇతర సేవా సంస్థలు నగదునే కోరుతున్నాయని, దీంతో రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది.

రైతులు, వ్యాపారులు, విద్యార్థులపై ప్రభావం

వ్యవసాయ పనులు, ఎరువులు, విత్తనాల కొనుగోలు, కూలీల చెల్లింపులు, వ్యాపార లావాదేవీలు, విద్యార్థుల ఫీజుల చెల్లింపుల కోసం నగదు అవసరమవుతున్న తరుణంలో ఈ కొరత మరింత ఇబ్బందికరంగా మారింది. రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడే చిన్న వ్యాపారులు, రైతులు, స్వయం ఉపాధి వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు తెరవకముందే ఖాతాదారులు క్యూలలో నిలబడుతున్నప్పటికీ, అందరికీ అవసరమైన మొత్తంలో నగదు అందడం లేదని సమాచారం.

గంటల తరబడి వేచి ఉన్న తర్వాత కేవలం రూ.5 వేలు లేదా రూ.10 వేలు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. మరోవైపు కొన్ని ఏటీఎంలలో కూడా నగదు లేకపోవడంతో మూసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నగదు కొరత కారణంగా బ్యాంకు సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నగదు లేకపోవడంలో తమ తప్పు లేదని, పైస్థాయి నుంచి సరిపడా నగదు సరఫరా కాకపోవడమే ప్రధాన కారణమని కొందరు సిబ్బంది చెబుతున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకర్ల వివరణ ఇదే..

ఈ విషయమై ఒక బ్యాంకు మేనేజర్ను సంప్రదించగా గత కొన్నేళ్లుగా డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దీంతో బ్యాంకుల వద్ద నగదు నిల్వలు గతంతో పోలిస్తే తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం పెద్ద మొత్తంలో నగదు సేకరించడం కూడా కష్టంగా మారిందని, పరిసర ప్రాంతాల బ్యాంకులను సంప్రదించినప్పటికీ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉందని వివరించారు. 

ఉన్నతాధికారులు స్పందించాలంటున్న ప్రజలు

ప్రజల సొంత డబ్బు బ్యాంకుల్లో ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో నగదు పొందలేకపోవడం ఆందోళనకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మధిర పట్టణంలోని బ్యాంకులకు తక్షణం అదనపు నగదు కేటాయించి సమస్యను పరిష్కరించాలని వ్యాపార వర్గాలు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఖాతాదారులు సంబంధిత ఉన్నతాధికారులను కోరుతున్నారు. నగదు కొరత సమస్యను త్వరగా పరిష్కరించకపోతే ప్రజా అసంతృప్తి మరింత పెరిగే అవకాశముందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కొనసాగాలంటే నగదు కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.