26 July, 2026 | 2:22 PM

ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నలుగురు బాలికలు అదృశ్యం

26-07-2026 01:19 PM

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో (Zilla Parishad High School) చదువుతున్న నలుగురు బాలికలు ఒకేసారి అదృశ్యమవడం (Missing) స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 2026 జూలై 23న స్కూలుకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన ఈ విద్యార్థినులు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన నలుగురు బాలికలు బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల పిల్లలు. వారి తల్లిదండ్రులు పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ పరిశ్రమలలో పని చేస్తున్నారు.

మిస్సింగ్ అయిన బాలికలను వీరుగా గుర్తించారు. కుష్బూ కుమారి (16సంవత్సరాలు) మహిమా కుమారి (12 సంవత్సరాలు) రోజాకుమారి (12సంవత్సరాలు) ప్రియా కుమారి (12 సంవత్సరాలు) బాలికలు ఎప్పటిలాగే స్కూల్ బ్యాగులతో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి ఇళ్ల నుండి బయలుదేరారు. సాయంత్రమైనా వారు తిరిగి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులను సంప్రదించగా, ఆ రోజు బాలికలు అసలు పాఠశాలకే రాలేదని తెలిసింది.

బంధువులు, తెలిసిన చోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో, జూలై 25న తల్లిదండ్రులు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.బాలికలను సురక్షితంగా కనిపెట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలను (Special Teams) రంగంలోకి దించారు.పాఠశాల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.