సచివాలయంలో కులహంకారం
- అట్రాసిటీ కేసుపెట్టిన మహిళా ఉద్యోగి
- కేసు గురించి మాట్లాడాలని అర్థరాత్రి మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లిన నలుగురు వ్యక్తులు
- తనకు, తన కుటుంబానికి ఏమైనా జరిగితే వాళ్లదే బాధ్యత అంటున్న మహిళా ఉద్యోగి
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 23 (విజయక్రాంతి) : తెలంగాణ సచివాలయంలో కుల అహంకారం పెచ్చుమీరుతున్నది. సహచర ఉద్యోగుల నుంచి కుల వివక్షను ఎదుర్కొన్న ఓ మహిళా ఉద్యోగిని అవమానాలను, మానసిక దాడులను భరించలేక చివరకు అట్రాసిటీ కేసు పెట్టింది. దీంతో ఆ మహిళా ఉద్యోగిపై వేధింపులు రెట్టింపయ్యాయి.
అంతేకాదు అట్రాసిటీ కేసు వాపస్ చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు ఏకంగా ఓ సచివాలయ ఉద్యోగి తనతో మరో ముగ్గురు అగంతకులను వెంటబెట్టుకొని అర్ధరాత్రి ఆ మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడంతో ఆందోళనకు గురైన బాధితురాలు జరిగిన సంఘట నను సచివాలయ ఉద్యోగుల వాట్సప్ గ్రూప్‌లలో పోస్టు పెట్టింది. ఇప్పుడు బాధిత మహి ళా ఉద్యోగిని పెట్టిన పోస్టు తెలంగాణ సచివాలయ ఉద్యోగులలో అలజడి రేపుతున్నది.
ఆమె పోస్టులో ఏమున్నదంటే...
‘నేను ఫైనాన్స్ డిపార్టమెంట్‌లో జేఎస్‌గా పని చేస్తున్నా. ఎన్నో దాడులను, అవమానాలను ఎదుర్కొన్నా. సోషల్ మీడియాలో కులం పేరుతో దూషించారు. వీటిని తట్టుకోలేకనే ఫైనాన్స్ విభాగంలో డీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న పద్మావతిపై, ఫైనాన్స్ విభాగంలో ఎస్‌ఓగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన వరలక్ష్మిపై అట్రాసిటీ కేసు పెట్టా. కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. గతంలోనూ ఇతరులతో చెప్పించారు. కొన్ని రోజులుగా సెక్షన్ అధికారి సిరియాళ ద్వారా డిపార్ట్మెంట్ గ్రూప్‌లో తనపై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా నన్ను అగౌరవపరిచేలా మెసేజ్‌లు పెట్టిస్తున్నారు. శనివా రం రాత్రి 8:30కి సిరియాళ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులతో మా ఇంటి వద్దకు వచ్చింది. అందులో ముగ్గురు అసలు డిపార్ట్మెంట్‌తో ఎటువంటి సంబంధంలేని వారున్నారు.’
ఆపరేషన్ అయ్యిందని చెప్పినా వినకుండా..
‘నాకు ఆపరేషన్ అయ్యిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కాబట్టి డాక్టర్ ఎవరిని కలవకూడదన్నారని మా పాప ఎన్నిసార్లు చెప్పినా ఎటువంటి మానవత్వం లేకుండా పట్టు పట్టి నన్ను కలవనిదే అక్కడనుంచి వెళ్ళమని మా ఆయనతో, కూతురుతో సిరియాళ తోపాటు అతనితో వచ్చిన ముగ్గురు వాగ్వాదానికి దిగారని, సిరియాళను నేను కలవను అనడంతో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషిని మా ఇంటిలోపలికి పంపి కేసు వాపస్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చా’రని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధించిన ఉద్యోగులపై కేసు పెడితే సిరియాళ ఎందుకు తనను వేధిస్తున్నాడో అర్థం కావడం లేదని, సెలవులో ఉన్న ఉద్యోగి వద్దకు అర్థరాత్రి కేసు గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏముందని బాధితురాలు రాసిన పోస్టులో పేర్కొన్నారు.
కేవలం తనతోపాటు తన కుటుంబ సభ్యులను బెదిరించేందుకే వాళ్లు వచ్చారని, వాళ్ల నుంచి తనతో పాటు తన కుటుంబానికి హాని ఉందని ఆ పోస్టులో బాధిత మహిళా ఉద్యోగిని పేర్కొన్నారు. గతంలో వాట్సప్ గ్రూప్‌లలో తనను అగౌరవపర్చినప్పుడు స్పందించని సిరియాళ, ప్రవీణ్ అనే ఉద్యోగులు ప్రస్తుతం తనపై అసత్య ప్రచారం చేస్తూ పెడుతున్న పోస్టులతో భయబ్రాంతులకు లోనై ఉద్యోగులందరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పోస్టు పెడుతున్నానని బాధిత మహిళా ఉద్యోగి ఆ పోస్టులో పేర్కొన్నారు.






