యూత్ గుండె చాలా వీక్ గురూ!
గుండె పోటు రావడానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. రెండేళ్ల చిన్నారి నుంచి.. ముసలి వయసులో ఉండేవారు కూడా హార్ట్ ఎటాక్‌కి గురవుతున్నారు. అసలు విషయం ఏంటో తెలిసేలోపే గుండె పోటుతో కుప్పకూలి పోతున్నారు. ముఖ్యంగా యూత్ ఎక్కువగా గుండెపోటుతో చనిపోవడం చాలా బాధకరం. గుండెపోటు రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతీయుల్లో 50 శాతం హార్ట్ ఎటాక్‌లు 50 ఏళ్ళలోపు ఉన్నావారికే సంభవిస్తున్నాయి. ఈ పరిశోధన, అధ్యయనాల ప్రకారం యూత్‌లో గుండెపోటు పెరుగుతోంది. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు గుండెపోటు కారణంగా మరణిస్తున్నారంటే ఈ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు గుండెపోటుకు కారణాలేంటి? హార్ట్ ఎటాక్ లక్షణాలు? గుండెపోటు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం..!
హార్ట్ ఎటాక్
జీవితంలో అత్యంత ముఖ్యమైన వాళ్లు, ఆత్మీయులు, ప్రేమించేవాళ్లు మరణించడం అనే బాధ వర్ణనాతీతం. ఇక వారు తిరిగిరారని తాము బతకడం కూడా కష్టమేనని భావించే స్థాయిగల సమస్యను ‘హార్ట్ టు బ్రేక్’ అని పిలుస్తారు. ఇలాంటివి పురుషుల కంటే మహిళల్లో అధికంగా ఉంటాయి. ఈ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రో మ్’తో తొమ్మిది రెట్లు ఎక్కువగా బాధపడుతున్నది మహిళలే. మామూలు ఆడవాళ్లతో పోలిస్తే భర్త చనిపోయిన మహిళలే ఈ సిండ్రోమ్‌తో ఎక్కువ బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. బాధ కలిగినప్పుడు అడ్రి నల్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు ఒత్తిడికి లోనవుతారు. దాంతో హార్ట్‌లో రక్త సరఫరా అధికమై బెలూన్‌లా ఉబ్బి పగిలిపోతుంది. 55 సంవత్సరాలలోపు ఉన్న మహిళల్లో అయితే ఇది 7.5 రెట్లు. ఆ పై వయసు కలిగిన వాళ్లలో 9.5 శాతం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని అంచనా.
మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రుతుచక్రం అనేది గుండె పోటు నుంచి మహిళలకు కొంతవరకు రక్షణలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 45 ఏళ్లకు పైబడిన మహిళలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా గుండె పోటు వస్తుంది. ఈ రెండు వర్గాల మధ్య గుండె పోటు నిష్పత్తి 1ః10గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంటే ఒక మహిళకు గుండెపోటు వస్తే అటువైపు పది మంది పురుషులకు గుండె పోటు వస్తోందని వైద్యులు చెబుతున్నారు. యువకుల్లో గుండె పోటుకు ప్రధాన కారణాలు.. జీవన శైలిలో మార్పులు, ధూమపానం, మద్యం సేవించడం, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం.
గుండె పోటుకు కారణాలు
1. ధూమాపానం, మద్యపానం
2. గాలి కాలుష్యం
3. జన్యుపరమైన, వంశ పారంపర్య కారణాలు
4. గుండె పోటు లక్షణాలు
5. ఛాతీ మంట, ఛాతీ బరువుగా ఉండటం, మధ్యలో నొక్కినట్టు అనిపించడం
6. చెమటలు పట్టడం, వాంతులు, విపరీతమైన అలసట రావడం
7. అనారోగ్యకరకమైన జీవన శైలి, వ్యాయామం చేయకపోవడం, కఠిన వ్యాయామాలు చేయడం
8. అధిక ఒత్తిడి, డయాబెటిక్ వల్ల కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది
9. అధిక కొలెస్ట్రాల్
హార్ట్ ఎటాక్ లక్షణాలు?
1. కడుపులో తీవ్రమైన నొప్పి
2. పొత్తి కడుపు ఉబ్బినట్టుగా అనిపించడం
3. కడుపులో గ్యాస్ పెరిగినట్లు, లేదా అసిడిటీగా అనిపించడం
4. ఛాతీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించడం
5. గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం
6. శరీరం మొరాయిస్తున్నట్లుగా అనిపించడం, చాలా అలసటగా ఉండటం
7. గుండె నుంచి వెన్నువైపుగా నొప్పి కదులుతున్నట్లు అనిపించడం, దీన్ని నడుం నొప్పిగా భావించి అసలు అశ్రద్ధ చేయకూడదు.
8. కుటుంబంలో ఎవరైనా 30 లేదా 40ల వయసులో ఒక్కసారిగా గుండె పోటుతో మరణించినట్లయితే వెంటనే అందరూ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. కొవ్వు అధికంగా ఉన్నవారు, గుండె కొట్టుకొనే వేగంలో తేడాలున్నవారు కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
2. కఠిన వ్యాయామం చేసే ముందు గుండె పరీక్షలు చేయించుకోవాలి.
3. 20 ఏళ్ల పైబడినవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
4. రోజుకు కనీసం ఒక అరగంట యోగా, ధ్యానం చేయాలి.
5. రోజుకు కనీసం అరగంట పాటు నడవాలి లేదా వ్యాయామం చేయాలి.
6. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, నూనె ఎక్కువగా వాడిన ఆహారం మానేయాలి.
7. మానసిక ప్రశాతంత చాలా ముఖ్యం.
కరోనా ఎఫెక్ట్!
1. ఒక కొత్త వైరస్‌పై రోగ నిరోధక వ్యవస్థ పోరాటం మొదలుపెట్టినప్పుడు.. ఒక్కోసారి గుండెలోని రక్తనాళాలు కూడా దెబ్బతినే ముప్పు ఉంటుంది.
2. ముఖ్యంగా రక్త నాళాలు కుంచించుకుపోతాయి. ఫలితంగా వాటిలో రక్తం సాఫీగా ప్రసరించేందుకు వీలుపడదు. దీన్నే వ్యాస్కులర్ ఇన్‌ఫ్లమేషన్‌గా పిలుస్తారు.
3. అప్పటికే గుండె సమస్యతో బాధపడేవారికి గుండె సమస్యలు వచ్చే ముప్పు మరింత ఎక్కువవుతుంది.
4. ఏసీఈ సాయంతో మన శరీరంలోకి కరోనావైరస్ ప్రవేశిస్తుంది. రక్త నాళాల లోపలి గోడల్లో ఈ ప్రోటీన్ ఉంటుంది.
5. గుండె పనితీరు సవ్యంగా ఉండటం, రక్తపోటు నియంత్రణ, దెబ్బతిన్న రక్తనాళాల ను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడంలో కూడా ఈ ప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రెగ్యులర్ చెకప్ అవసరం
35 ఏళ్లలోపు కచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించి అన్ని పరీక్షలు చేయించుకోవాలి. వయసుతో పాటు వచ్చే సమస్యలను మొదట్లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవారు, గుండె కొట్టుకునే వేగంలో తేడాలున్నవారు కొత్తగా వ్యాయామం, కఠిన శారీరక శ్రమ చేసే ముందు ఆయా పరీక్షలు చేయించుకోవాలి. గుండె పోటు వచ్చే ముందు ప్రధాన లక్షణం ఛాతీ నొప్పి ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే అది కరెక్ట్ కాదని వైద్యులు చెబుతున్నారు. ఛాతీలో ఎలాంటి అసౌకర్యం, ఛాతీ మంట, బరువుగా ఉండటం, ఛాతీ మధ్యలో నొక్కినట్టు ఉండటం, చెమటలు పట్టడం, వాంతులు, విపరీతమైన అలసట వంటివి గుండె పోటు లక్షణాలుగా భావించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు గుర్తిస్తే తక్షణమే కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి.






