25 April, 2026 | 7:09 PM

ఆర్టీసీ సమ్మె విరమణతో సంబరాలు

25-04-2026 05:55 PM

కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నాయకులు, కార్మికులు

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శనివారం ఆసిఫాబాద్ బస్టాండ్‌ను సందర్శించి కార్మికులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో జరిగిన చర్చల ఫలితంగా సమస్య పరిష్కారం సాధ్యమైందని తెలిపారు. కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేయడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు, గుర్తింపు సంఘాల ఎన్నికలకు అంగీకారం వంటి నిర్ణయాలు చారిత్రాత్మకమన్నారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పట్టించుకోని సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం కొద్ది నెలల్లోనే పరిష్కరించిందని సుగుణక్క వ్యాఖ్యానించారు. కార్మికులు సంతోషంగా విధుల్లో చేరడం సంతోషకరమని, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు యథావిధిగా నడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.