రైతు బీమాను వెంటనే పునరుద్ధరించాలి
- ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబీమాను రాష్ట్రంలో వెంటనే పునరుద్ధరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కుటుంబానికి అత్యవసర సమయంలో అండగా నిలిచే రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రైతు ఆకస్మికంగా మరణించినప్పుడు ఆ కుటుంబానికి రైతు బీమా అందించే ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని, అయితే కొత్తగా అర్హత పొందిన రైతుల నమోదు, మార్గదర్శకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతు బీమా పథకాన్ని బలోపేతం చేసి అర్హత ఉన్న ప్రతి రైతును వెంటనే పథకంలో చేర్చాలని కోరారు.
రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ నిధులు అందిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం, పథకాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎంఎల్ఏ పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు ( RKVY, SMAM, NFSM, PMKSY, PMFBY) రాష్ట్రం వాటా విడుదల చేయాలన్నారు. ఈ పథకాలకు అవసరమైన Matching Grant/State Shareను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల రైతులకు కేంద్ర పథకాల పూర్తి ప్రయోజనం అందడం లేదని విమర్శించారు.
వ్యవసాయం రాష్ట్ర అంశమైనప్పటికీ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం కనీసం తన Matching Share అయినా చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ Matching Grants విడుదల చేసి కేంద్ర పథకాల ప్రయోజనాలను రైతులకు అందించాలని కోరారు. విత్తనాలు, యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్‌పై దృష్టి పెట్టాలి. NFSM వంటి పథకాల ద్వారా రైతులకు సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు అందించే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర వాటా విడుదల చేయకపోవడం వల్ల రైతులకు పూర్తి ప్రయోజనం అందడం లేదని ఆన్నారు.
ఆదిలాబాద్‌లో సోయాబీన్ వంటి నూనెగింజల పంటలు ఎక్కువగా సాగవుతున్నందున సీజన్‌కు ముందే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణలో రైతుకు అవసరమైన పరికరాలే అందించాలని, ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తేవాలని కోరారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. రైతు పంట వేసే సమయంలో రైతు భరోసా అందాలి కానీ పంట కాలం ముగిసిన తర్వాత కాదని ఆయన అన్నారు.
రైతులకు రావాల్సిన పెండింగ్ రైతు భరోసా మొత్తాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రుణమాఫీ పూర్తయిందని ప్రకటించిందని, అయినప్పటికీ అనేక మంది అర్హులైన రైతులకు ఇంకా ప్రయోజనం అందలేదని ఎమ్మెల్యే అన్నారు. రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెబుతోందని, మరి ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు హామీ మేరకు రుణమాఫీ ప్రయోజనం అందించాలని డిమాండ్ చేశారు.
డ్రిప్, స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పథకాలకు లక్ష్యాలను పెంచి, రైతులకు సబ్సిడీని బలోపేతం చేయాలని అన్నారు. ATMA ద్వారా రైతులకు Exposure Visits, Demonstrations, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయాల్సి ఉండగా, ఆ వ్యవస్థ రైతుల ప్రయోజనాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదని ఎంఎల్ఏ అన్నారు. రైతుల కోసం ఉండాల్సిన వ్యవస్థలో రైతులే కేంద్రబిందువుగా ఉండాలని, రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మార్చకూడదని ఆయన స్పష్టం చేశారు.
రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు బీమా పునరుద్ధరణ, రైతు భరోసా పెండింగ్ నిధులు, రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, కేంద్ర పథకాల Matching Grants, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ, మైక్రో ఇరిగేషన్, పంట బీమా వంటి అన్ని అంశాలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాందాస్, దయాకర్, కార్తీక్, సన్నీ, కరుణాకర్ రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






