ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం 273 కోట్లు
పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇండ్లకు తన వాటా కింద విడుదలకు ఆమోదం
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీసీ గౌతమ్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పీఎం అవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలతో రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో రూ.910.65 కోట్లతో మొత్తం 18,213 ఇండ్లను నిర్మించాలన్న ప్రతిపాదలను కేంద్రం ఆమోదించింది.
తన వాటాగా నిధులను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించిందని హౌసింక్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎంఏవై (పట్టణం) 2.0 పథకం సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదలనకు ఆమోదం తెలిపినట్టు ఆయన వివరించారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా ఇంటి వసతిని కల్పించేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలను ఆర్థిక సహాయంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం రూ.910.65 కోట్లకు కేంద్ర ప్రభుత్వ వాటా రూ.273.20 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.637.45 కోట్లు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల ద్వారా ఇండ్ల నిర్మాణాలను చేపట్టడానికి అనుమతిచినట్టు, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం కావడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.




