11 March, 2026 | 12:02 PM

కేటీఆర్.. చిల్లర రాజకీయాలు మానుకో

11-03-2026 12:00 AM

విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి   

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్   

హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ప్రభుత్వంపైన, సీఎం రేవంత్‌రెడ్డిపైన వ్యక్తిగత విమర్శలు చేయడం కేటీఆర్ మారకపోతే ఇంకో రకంగా స్పందించాల్సి వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఇంత చిల్లరగా ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి  ఓపికగా ఉంటున్నారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ తన కుటుంబానికి దోచి పెట్టారని విమర్శించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బంధు, కేటీఆర్ బంధు, హరీశ్ బంధు, సంతోష్ బంధు, కవిత బంధు ఉండేదన్నారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు చేయడం కేటీఆర్ మానుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్ట అని, నిజాలను అబద్ధాలుగా మార్చడం కేటీఆర్‌కి అలవాటేనని సంపత్ మండిపడ్డారు.

విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని, పచ్చి అబద్ధాలను కేటీఆర్ ప్రజలపై రుద్దుతున్నారని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీకి సొంత ఇల్లు లేదని, ఆయనకు ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే రూ. 1000 కోట్లు అవుతాయని రేవంత్ అన్నాడని ఆయన తెలిపారు. కానీ, సీఎం మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ డబ్బులను కేటీఆర్ దుబారా చేశారని తెలిపారు.