13 June, 2026 | 2:14 AM

ధరల నియంత్రణలో కేంద్రం విఫలం

13-06-2026 12:00 AM

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్

కొమురవెల్లి, జూన్ 12 : నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ అన్నారు. మండల కేంద్రమైన కొమురవెల్లిలోని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను ప్రవేట్ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు. ఈ మహాసభలో పాల్గొని మాట్లాడుతూ వంట గ్యాస్ పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకి బగ్గుమంటున్నాయన్నారు.

ప్రతి కుటుంబానికి వందరోజుల పని గ్యారంటీ చేస్తూ యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి, వి బి జి రామ్ జి తెచ్చి పేదల పొట్ట కొట్టిందన్నారు. ఈ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన తెస్తున్న విద్యుత్ సంస్కరణల చట్టం ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే ప్రమాదం ఉందన్నారు. కార్మిక హక్కులను హరించడంలో భాగంగానే లేబర్ కోడ్స్ చట్టాన్ని తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదన్నారు. వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మహాసభలలో వ్యవసాయ కార్మికుల సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి, కామిని గోపాలస్వామి, బండ్ల కింది అరుణ్ కుమార్, తాటూజి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.