13 June, 2026 | 1:08 AM

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు విజ్ఞాన యాత్ర

13-06-2026 12:01 AM

ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సందర్శనకు రైతుల బృందం

సంగారెడ్డి, జూన్ 12 : రైతుల్లో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన పెంపొందించి, శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతుల కు రెండు రోజుల ఆయిల్ ఫామ్ విజ్ఞాన యాత్రను గురువారం అడిషనల్ కలెక్టర్  సంగీత జెండా ఊపి  ప్రారంభించారు.

జాతీయ ఆయిల్ ఫామ్ మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ విజ్ఞాన యాత్రకు సంగారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఆయిల్ ఫామ్ సాగుపై ఆసక్తి గల 22 మంది రైతులను ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని ఆయిల్ ఫామ్ తోటల సందర్శనకు గోద్రెజ్ ఆగ్రోవెట్  సంస్థ సహకారంతో  తీసుకెళ్లినట్లు  జిల్లా ఉద్యాన అధికారి సోమేశ్వర తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్  సంగీత రైతుల బృందం విజ్ఞాన యాత్రను  జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయక పంట అని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ముందుకు రావాలని సూచించారు.

ఈ విజ్ఞాన యాత్ర ద్వారా రైతుల్లో ఆయిల్ పామ్ సాగుపై మరింత అవగాహన పెరిగి, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టేందుకు ప్రోత్సాహం లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి  సోమేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారులు, గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.