ఇథనాల్ బ్లెండింగ్‌కు సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఇథనాల్ బ్లెండింగ్ దిశగా భారత్ శరవేగంగా అడుగులు వేస్తున్నది. పెట్రోల్‌లో 30 శాతం ఇథనాల్ (ఈ30) కలిపేందుకు కేంద్రప్రభుత్వం సమాయత్తమవుతున్నది. ఇప్పటికే మన దేశంలో ఈ20 ఇంధనం వినియోగంలో ఉన్న విషయం విదితమే. 2030 నాటికి చేరుకోవాల్సిన ఈ లక్ష్యాన్ని భారత్ ఐదేళ్ల ముందుగానే చేరుకోవడం విశేషం. కాగా, చమురు ధరల పెరుగుదల, దిగుమతుల భారం, పర్యావరణ సమస్యల కారణంగా ప్రత్యామ్నాయ ఇంధనాలపై అన్ని దేశాలు దృష్టి పెడుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశాల్లో ఒకటైన భారత్ ఈ విషయంలో ఒక అడుగుముందే ఉంది. చెరకు నుంచి ఉత్పత్తయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. తద్వారా దిగుమతి బిల్లును భారీగా తగ్గించుకోవడంతో పాటు విదేశీ మారకద్రవ్య నిల్వలను ఆదా చేసుకోవాలన్నది భారత వ్యూ హం. అదే సమయంలో రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెప్తున్నది.
సర్కార్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, ఈ విధానంపై విమర్శలు లేకపోలేదు. చెరకు పంటకు ఎక్కువ నీరు అవసరం. ఈ నేపథ్యంలో ఇప్పటికే నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాం తాల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను విస్మరించలేం. మరోవైపు భవిష్యత్తులో ఆహార భద్రతపై ప్రభావం పడొచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది.
ఇథనాల్ చౌకైన ఇంధనమని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, పెట్రోల్ ధరలు తగ్గకపోవడంపై చర్చ నడుస్తున్నది. ఇథనాల్ బ్లెండింగ్ వల్ల కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం వినియోగదారుడికి బదిలీ చేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. భారీ మొత్తంలో ఇథనాల్ బ్లెండింగ్ చేస్తుండటంతో వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, మైలేజీ తగ్గిపోతున్నదనే ఫిర్యాదులను ఇటు ప్రభుత్వం, అటు వాహన తయారీ కంపెనీలు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఇథనాల్ బ్లెండింగ్ విధానంలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరాన్ని ఈ అంశాలన్ని నొక్కిచెప్తున్నాయి. అయితే అధిక నీటి వినియోగం, ఆహార భద్రత, వినియోగదారుడికి ధరల ప్రయోజనం వంటి అంశాల్లో సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. మొత్తానికి ఇటు రైతులకు, అటు ఇంధన వినియోగదారులకు మేలు జరిగితేనే ఈ విధానం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని చెప్పక తప్పదు.






