కులగణనపై సుప్రీం తీర్పును వక్రీకరించొద్దు
సుప్రీంకోర్టు 20 సుధాకర్ గుమ్ముల అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ (సివిల్) డైరీ నం. 50275/2025ను కొట్టివేసింది. ఈ పిటిషన్‌లో జనగణనలో కులగణన నిర్వహించకూడదని పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి కోరారు. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసిన సందర్భంగా ఒక కీలకమైన అంశాన్ని స్పష్టం చేసింది. జనగణనలో కులగణన చేపట్టాలా, వద్దా? అన్నది పూర్తిగా కేంద్రప్రభుత్వ శాసనపరమైన విధాన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. అంటే, జనగణనలో కులగణన విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అని కోర్టు స్పష్టతనిచ్చింది.
సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సారాంశాన్ని తెలుగులోకి అనువదిస్తే ఇలా ఉంటుంది: “కుల ఆధారిత జనగణన, దానికి అనుబంధ అంశాలు ప్రధానంగా శాసనపరమైన విధాన నిర్ణయాల పరిధిలోకి వస్తాయి. అందువల్ల ప్రస్తుత రిట్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. కాబట్టి, ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ఇతర దరఖాస్తులు కూడా ముగిసినట్లుగా పరిగణించబడతాయి”.
అయితే, ప్రస్తుతం కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పనిసరిగా కులగణన నిర్వహించాలని ఆదేశించలేదు. కొన్ని రాజకీయ పార్టీలు మా సర్వే వల్లే సుప్రీంకోర్టు ప్రభావితమై కేంద్రానికి కులగణన చేయాలని సూచించిందనే విధంగా ప్రచారం చేయడం వాస్తవాలకు విరుద్ధం. అదే విధంగా, కొన్ని బీసీ సంఘాలు కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక డైరెక్షన్ ఇచ్చినట్టుగా, లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేను ప్రశంసించినట్టుగా చెప్పడం సరైన విశ్లేషణ కాదు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినది కుల సర్వే, కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేది సెన్సస్ లేదా అధికారిక జనగణన. సెన్సస్ యాక్ట్ 1948 కింద నిర్వహించే జనగణనకే పూర్తి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత, అధికారిక గుర్తిం పు ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ సర్వేలను కేంద్ర సెన్సన్‌తో సమానంగా పరిగణించడం సరికాదు. మొదటి నుంచీ బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వంటి సంస్థలు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా కులగణన జరపాలని నిరం తరం డిమాండ్ చేస్తూ వచ్చాయి.
2024 డిసెంబర్ 11న ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో కులగణన అవసరంపై జాతీయ సెమినార్ నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే, తెలంగాణలో కులగణన చేపట్టకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిన సమయంలో, 2024 జూలై 30న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, బీసీ సంఘాలకు ఈ అంశంపై అవగాహన కల్పించడమైనది. ఆ తరువాత అనేక బీసీ, బహుజన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కులగణన కోసం ఉద్యమాలు చేపట్టాయి.
ఆ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, 2024 అక్టోబర్ 10న కుల సర్వే నిర్వహణకు సంబంధించిన జీవో జారీచేసింది. అనంతరం 2024 నవంబర్‌లో సర్వే జరిగింది. కాబట్టి, తెలంగాణలో జరిగిన కుల సర్వే వెనుక అనేక బీసీ సంఘాల దీర్ఘకాల పోరాటం, సామాజిక చైతన్యం, రాజకీయ ఒత్తిడి ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. అందువల్ల, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కులగణన నిర్వహించాలని ప్రత్యక్ష ఆదేశాలు ఇచ్చిందని చెప్పడం తప్పుడు ప్రచారమే. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ వర్గాలు లేదా సంఘాలు చేస్తున్న అతిశయోక్తి ప్రచారాలను బీసీ ప్రజలు, ఇతర సామాజిక వర్గాలు విమర్శనాత్మక దృష్టితో పరిశీలించాలి. వాస్తవాలను తెలుసుకొని, చట్టపరమైన, రాజ్యాంగపరమైన పరిమితులను అర్థం చేసుకొని స్పందించడం అవసరం.
టీ చిరంజీవులు, విశ్రాంత ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్
బాలగోని బాలరాజు గౌడ్,బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్






