కాసేపట్లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చంద్రబాబు
హైదరాబాద్ : కాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు వస్తున్నారు. టీడీపీ శ్రేణులు బాబుకు ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నారు.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు నివాసం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ లో భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీకి ప్రజాభవన్ లో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ప్రధానంగా షెడ్యూల్ 9,10లోని సంస్థల విభజనపై, విద్యుత్ సంస్థల అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






