22 April, 2026 | 5:41 AM

పప్పు కుమ్మరించి ట్రిపుల్ తలాక్

25-08-2024 12:34 AM

యూపీలో భార్యకు ఓ వ్యక్తి విడాకులు

లక్నో, ఆగస్టు 24: ఉత్తరప్రదేశ్‌లో ఓ ముస్లిం మహిళ ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పొగిడినందుకు ఆమె భర్త ఆగ్రహావేశాలతో ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులిచ్చాడు. బహ్రయిచ్ ప్రాంతానికి చెందిన 19 ఏండ్ల మహిళ దేశంలో ప్రధాని మోదీ, యూపీలో యోగి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పొగిడారు. దీంతో ఆమె అత్తగారి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోయి ఆమెపై దాడి చేశారు.

మహిళ భర్త అర్షద్, మరుదులు ఫర్హాన్, షఫాఫ్, ఆడపడుచులు సిమ్రన్, కుల్సుమ్, అత్త రైసా, మామ ఇస్మాయిల్ కలిసి బాధితురాలిని కొట్టారు. భర్త అర్షద్ బాధితురాలిపై కాలేకాలే పప్పును కుమ్మరించి వెంటనే మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్  అని చెప్పి విడాకులు ఇచ్చాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి నిందితులందరినీ జైలుకు తరలించినట్టు బహ్రయిచ్ పోలీస్ సూపరింటెండెంట్ వ్రిందా శుక్ల తెలిపారు. బాధితురాలు మరియం శరీఫ్‌కు అర్షద్‌తో గత ఏడాదే వివాహమైంది. 

పర్యటన తెచ్చిన తంటా

హర్షద్ ఇటీవల తన భార్య మరియంను అయోధ్యకు పర్యటనకు తీసుకెళ్లాడట. అక్కడ కొత్తగా కట్టిన రామాయలంతోపాటు నగరంలో అభివృద్ధి పనులు చూసి మంత్రముగ్ధురాలైన ఆమె.. ఆ పనులు చేయించిన యోగిని, మోదీని పొగిడారట. అంతే.. అర్షద్‌కు పట్టరాని కోపం వచ్చి ఇంటికి రాగానే దాడి చేశారని ఫిర్యాదులో బాధితురాలు తెలిపారు.