25 May, 2026 | 11:25 AM

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి

20-08-2024 06:24 AM
  1. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 
  2. ప్రమోషన్స్ పొందిన ఎస్పీడీసీఎల్ ఉద్యోగులతో భేటీ

హైదరాబాద్, ఆగస్టు 19(విజయక్రాంతి): అందరం కలిసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలో ఎస్పీడీసీఎల్‌లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు.. డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. ఈ సందర్భంగా భట్టికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ..  ఏడు, ఏడున్నర ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికి పదోన్నతులు ఇవ్వాలని సీఎం, తాను, మంత్రి మండలి నిర్ణయించినట్టు చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులున్నా.. ఉద్యోగులు, అధికారులు బాగా పనిచేసే వాతావరణం కల్పించ డం కోసం పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్టు స్పష్టంచేశారు. ఉద్యోగుల కష్టసుఖాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అధికారులు, ఉద్యోగులు పెట్టే ప్రతి సంతకం, తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని.. సామాన్యునికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. భవిష్యత్తులోనూ ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం ఇదే తరహా ప్రోత్సాహాన్ని కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.