కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి
రైల్వే జీఎంకు ఎంపీ కావ్య, ఎమ్మెల్యే శ్రీహరి వినతి
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): కాజీపేటలో రైల్వే డివిజన్ కార్యాల యాన్ని ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. సోమవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి పలు రైల్వే సమస్యలపై చర్చించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని జీఎంకు వినతి పత్రం అందజేశారు. కాజీపేట, వరంగల్ స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లతో కూడిన మరో రెండు ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.
కాజీపేటలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం రైల్వే సబ్- డివిజనల్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులర్‌గా ఆపాలని కోరారు. నష్కల్ నుంచి హాసన్ పర్తి, నష్కల్ నుంచి చింతలపల్లి వరకు రెండు మార్గాల్లో రైల్వే బైపాస్ లైన్‌లను నిర్మించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. వరంగల్ నగరం గుండా వెళ్లే రైల్వే బైపాస్ పట్టణాభివృద్ధికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని తెలిపారు.
వీటికి ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్‌లో మార్పుచేసి మరో మార్గంలో రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం రూ. 1.75 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీకి జీఎం తెలిపారు. అదనపు ఫ్లాట్ ఫాంల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని జీఎం తెలిపారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రైల్వే బోర్డుకు అందచేసినట్లు వెల్లడించారు.






