మంకీ పాక్స్‌పై అప్రమత్తంగా ఉన్నం
- భయపడాల్సిన అవసరం లేదు
- గాంధీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు
- మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): మంకీ పాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో మంకీ పాక్స్ కేసులు నమోదు కాలేదని, ఈ వ్యాధి పట్ల పెద్దగా భయపడాల్సిన అవసరంలేదన్నారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంకీ పాక్స్ సన్నద్ధతపై అధికా రులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ఢిల్లీలో 15, కేరళలో 15 కేసులు నమోదయ్యాయని మంత్రి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.
రాష్ర్టంలోని అన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. గాంధీ, ఫీవర్ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచేలా ముందస్తు చర్య లు చేపట్టాలని సూచించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ ఛోంగ్తూ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్ వి కర్ణన్, ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.






