భూ పరిపాలనలో మార్పులు చేయాలి
- క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరగాలి
క్యాడర్ స్ట్రెంత్ మంజూరుపై దృష్టి పెట్టాలి
పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
ప్రభుత్వానికి టీజీటీఏ రాష్ర్ట కార్యవర్గం వినతి
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 17 (విజయక్రాంతి): క్షేత్రస్థాయి లో రైతులకు మేలు జరిగేలా భూ పరిపాలన చట్టాల్లో మార్పులు చేయాలని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) నాయకులు ప్రభుత్వానికి సూచించారు. భూ పరిపాలనలో మార్పులు చేస్తేనే రైతులకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) ప్రధాన కార్యాలయంలో సోమవారం టీజీటీఏ రాష్ర్ట కార్యవర్గ సమావేశం టీజీటీఏ రాష్ర్ట అధ్యక్షుడు ఎస్ రాములు అధ్యక్షతన జరిగింది. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం తీసుకోవల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ర్టం లోని ప్రభుత్వ ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిన జీవో నం.317ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రాష్ర్టంలో ప్రస్తుతం తహశీల్దార్లు ఎదుర్కొంటున్న సమస్యలు.. ధరణి, భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ మాట్లడుతూ రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీటీఏ ఆది నుంచీ పోరాడుతున్నదని తెలిపారు.
మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేసి ఉద్యోగుల సమస్యలతోపాటు రైతు ల సమస్యలను తీర్చేందుకు తహసీల్దార్లు కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలోనే రైతుల సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తేవాలని కోరారు. సమావేశం అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ నేతలు ఎస్ రాములు, పాక రమేష్, అరేటి రాజేశ్వర్, ఫూల్ సింగ్ చౌహాన్, పీ రాధ, శ్రీనివాస్ శంకర్‌రావు, మందుల నర్సయ్య పాల్గొన్నారు.
వినతి పత్రంలో టీజీటీఏ పేర్కొన్న సమస్యలు/డిమాండ్లు
- అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దూర ప్రాంతాలకు బదిలీ అయిన తహసీల్దార్లు నేటి వరకు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. వీరిని మళ్లీ పూర్వ స్థానాలకు బదిలీ చేయాలి.
- రెవెన్యూ శాఖలో అర్హులైన తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల (ఎస్‌జీడీసీ)కు పదోన్నతులు కల్పించాలి.
- తహసీల్దార్లకు ప్రభుత్వం ఇచ్చే అద్దె వాహనాల చార్జీలను పెంచడంతో పాటుపెండింగ్ బిల్లులను విడుదల చేయాలి.
- రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్లు, ఇతర సిబ్బందికి క్రమం తప్పకుండా వేతనాలు మంజూరు చేయాలి. కొత్తగా మండలాల్లో క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయాలి.
- వీఆర్‌ఏ, వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపించడం వల్ల గ్రామాల్లో భూ పరిపాలన అస్తవ్యస్థంగా మారింది. కాబట్టి గ్రా మీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- రెవెన్యూ శాఖలో అధికారాలను వికేంద్రీకరించాలి.
- భూ వివాదాలు వచ్చినప్పుడు రైతులు సివిల్ కోర్టులకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కావున రైతులకు అందుబాటులోనే భూ వివాదాలు పరిష్కారమయ్యేలా రెవెన్యూ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలి.






