స్థానికతపై 26న తుది విచారణ: హైకోర్టు
- రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు
- ఉద్యోగ నియామకాలపై ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి స్థానికత వివాదంపై ఈ నెల 26న తుది విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం 2018, ఆగస్టులో వెలువరించిన జీవో 124లోని స్థానికత నిబంధనల లోపాల కారణంగా వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను స్థానికులుగా పరిగణించా లని స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు గతంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ ఆదేశాలను రద్దు చేయాలంటూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇటీవల విచారించింది. ఏడో తరగతి వరకు వరుసగా నాలుగు సంవత్సరాలు ఒకచోట చదవకపోయినా జూనియర్ అసిస్టెంట్, ఇతర క్యాట గిరీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ఆ జిల్లా స్థానిక అభ్యర్థిగా పరిగణించాలని సింగిల్ జడ్జి ఆదేశించడం సరికాదని టీజీపీఎస్సీ వాదించింది. ఇలాంటి స్థానికత అంశా నికి సంబంధించిన మరికొన్ని పిటిషన్లు కూడా విచారణలో ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఈ నెల 26 తుది విచారణ చేపడతామని బెంచ్ వెల్లడించింది.
రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు
ఉద్యోగ నియామకాలపై ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీలో రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దని ఎస్పీడీసీఎల్‌ను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా నాన్‌లోకల్‌గా పరిగణించి నియామకాలు చేపట్టరాదని ఆదేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తనను స్థానికేతర కోటా అభ్యర్థిగా పరిగణించడాన్ని రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లాకు చెందిన టీ గోపాల్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఇటీవల జస్టిస్ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు.
పిటిషనర్ లాయర్ చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం 2109లో జారీ అయిన నోటిఫికేషన్ ఆధారంగా చేపట్టే నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయని 2021లో ఎస్పీడీసీఎల్ జనరల్ మేనేజర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులకే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం 2018లో జారీ చేసిన 124, 132 జీవోలకు వ్యతిరేకమని తెలిపారు.
పిటిషనర్‌కు 56 మార్కులు వచ్చాయని, 18వ ర్యాంకు సాధించాడని వివరించారు. అయితే సంగారెడ్డి జిల్లా స్థానికతగా పెట్టినా, స్థానికేతరుడిగా 5 శాతం కోటా కింద పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు. ఎస్పీడీసీఎల్‌కు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవని గతంలో ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పు పిటిషనర్‌కు వర్తిస్తుందని పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్‌కు మెరిట్ ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్‌ను ఆదేశించారు.






