ఛత్తీస్‌గఢ్ విద్యుత్తుతో నష్టం 6 వేల కోట్లు?
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో కుదుర్చుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ. 6 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మొదటి నుంచి వివాదం అవుతున్న నేపథ్యంలో విద్యుత్తు శాఖ అధికారులు ఇందుకు సంబంధించి జరిగిన నష్టంపై అంచనాల అంకెలతో కుస్తీలు పడుతున్నారు. ఇది రూ. 6 వేల కోట్లకుపైగా ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం.
ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు.. ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి 2000 మెగావాట్ల విద్యుత్తును గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు ఒప్పందం చేసుకోవడంతో.. రాష్ట్రానికి భారీగా నష్టం వాటిల్లిందని, దీనిపై విచారణ చేసేందుకు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌ను కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ విచారణ నేపథ్యంలో అప్పటి సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీచేసి పలు అంశాలపై వివరణ కోరారు. దీనికి జవాబుగా దాదాపు 12 పేజీల లేఖ రాసిన కేసీఆర్.. అనేక అంశాలను లేవనెత్తుతూ అసలు జస్టిస్ నర్సింహారెడ్డికి విచారణార్హత లేదని.. విచారణ నుంచి స్వచ్చందంగా తప్పుకోవాలంటూ విన్నవించడం మరింత సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలోనే విద్యుత్తు శాఖ అధికారులు ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమేర నష్టం వాటిల్లిందనే దానిపై దృష్టి సారించి.. అంచనాలు వేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా అంశాల వారీగా అధికారులు అంచనాకు వచ్చి.. దీనిని ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తుంది. అంశాల వారీగా ప్రభుత్వానికి వచ్చిన నష్టం అంచనాలు ఇలా ఉన్నాయి..
- ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్‌కు రూ.3.90కే అని చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగిందని అంచనా వేశారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలకు ఆర్థికంగా మరింత భారం పెంచేలా ఈ ఒప్పందం జరిగినట్టుగా అధికారులు అంచనాకు వచ్చారు.
- ఛత్తీస్‌గఢ్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసిన విద్యుత్తు మొత్తం 17,996 మిలియన్ యూనిట్లు. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌కు చేసిన చెల్లింపులు రూ. 7,719 కోట్లు. ఇంకా ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌కు చెల్లించాల్సిన బకాయిలు రూ. 1,081 కోట్లు. ట్రాన్స్‌మిషన్ లైన్ల ఛార్జీలు రూ. 1,362 కోట్లు అదనం. ఇవన్నీ లెక్కిస్తే.. ఒక్కో యూనిట్‌కు మనం చెల్లించే మొత్తం రూ. 5.64గా అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మొదట్లో చెప్పిన ధర కంటే వడ్డించిన ఛార్జీలతో దాదాపు రూ. 3,110 కోట్లు అదనంగా రాష్ట్ర విద్యుత్తు సంస్థలపై భారం పడినట్టుగా అంచనా వేశారు.
- నిజానికి బకాయిల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదు. కేవలం రూ. 1,081 కోట్లు బకాయిలు ఉన్నట్టుగా తెలంగాణ విద్యుత్తు సంస్థలు చెబుతున్నాయి. కానీ తమకు రూ. 1,715 కోట్లు బకాయిలు ఉన్నట్టుగా ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు సంస్థలు లెక్కలు చూపుతున్నాయి. ఈ బకాయిల వివాదంపై ఛత్తీస్‌గఢ్ ఎలక్ట్రీసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అక్కడ వివాదం పెండింగులో ఉంది.
- ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్న తరువాత.. అక్కడి నుంచి విద్యుత్తు 2017 చివరి నుంచి మన రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చింది. నిజానికి ముందు నుంచీ విద్యుత్తు అరకొరగానే సరఫరా అయ్యింది. ఎన్నడూ 1,000 మెగావాట్లు సాఫీగా రాలేదని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఆశించిన సరఫరా తగ్గిపోవడంతో తెలంగాణ డిస్కంలు బహిరంగ మార్కెట్లో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీనితో 2017 నుంచి 2022 వరకు పడిన అదనపు భారం రూ. 2,083 కోట్లని అంచనా వేశారు. నిజానికి ఛత్తీస్‌గఢ్ నుంచి 2022 ఏప్రిల్ నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
- ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు వీలుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లి. (పీజీసీఐఎల్)తో కారిడార్‌ను బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ కారిడార్ బుకింగ్ ఒప్పందం ప్రకారం విద్యుత్తు తెచ్చుకున్నా, తెచ్చుకోకపోయినా.. పీజీసీఐఎల్‌కు విద్యుత్తు సరఫరా (ట్రాన్స్‌మిషన్) ఛార్జీలు కట్టాల్సిందే. ఈ అంశం విషయంలో చెల్లించిన అదనపు ఛార్జీలు రూ.638 కోట్లుగా అధికారులు చెబుతున్నారు.
- వాస్తవానికి 1,000 మెగావాట్ల కారిడార్ సరిపోతుందని.. కానీ అదనంగా మరో వేయి మెగావాట్ల కారిడార్‌ను గత ప్రభుత్వం బుక్‌చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇలా అదనంగా బుక్ చేసుకున్న మరో వేయి మెగావాట్ల కారిడార్‌ను విద్యుత్తు సరఫరా ఛత్తీస్‌గఢ్ చేయలేదని తలచి అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. అయితే ఈలోగానే జరగాల్సిన నష్టం జరిగిందని, పరిహారం కింద పీజీసీఐఎల్‌కు సుమారు రూ. 261 కోట్లు కట్టాల్సి వచ్చిందని అధికారులు అంచనా వేశారు. అవగాహన లేకుండా కారిడార్ ఒప్పందం చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది.






