29 August, 2026 | 6:10 PM

ఉద్యోగాల పేరుతో రూ. లక్షల వసూళ్ల ఆరోపణలు

29-08-2026 05:37 PM

ఎమ్మెల్యే పీఏపై పోలీస్ స్టేషన్లో కేసు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 29 (విజయక్రాంతి): అధికార పార్టీ ఎమ్మెల్యే వద్ద పర్సనల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో పలువురి దగ్గర రూ కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి. మణుగూరులోని థర్మల్ పవర్ స్టేషన్, హెవీ వాటర్ ప్రాజెక్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దండుకున్నట్లు తెలుస్తోంది.

భద్రాచలంలో ఉద్యోగాల పేరుతో కోట్లల్లో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యవహారంలో భద్రాచలం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు కే. కళ్యాణ్‌కుమార్‌పై భద్రాచలం పోలీసు స్టేషన్లో కేసు నమోదు కావడం స్థానికంగా, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు హామీలు ఇచ్చి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుండగా, ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

స్థానిక అంబాసత్రం రోడ్డుకు చెందిన ఆటోవాలా రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం పట్టణ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, మణుగూరులోని ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించారు. ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో తన ఆటోను తాకట్టు పెట్టి విడతల వారీగా నగదు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

డబ్బులు చెల్లించిన అనంతరం తనకు అందించిన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌పై అనుమానం రావడంతో పరిశీలించగా, అది నకిలీ పత్రమై ఉండొచ్చని భావించి సంబంధిత వ్యక్తిని నిలదీసినట్లు బాధితుడు తెలిపారు. అనంతరం ఆయన అందుబాటులో లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇక్కడే మరో కీలక అంశం తెరపైకి వస్తోంది. ఇది ఒక్కరి ఫిర్యాదుతో పరిమితమైన వ్యవహారమా..? లేక ఉద్యోగాల పేరుతో మరికొందరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానికంగా ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామంటూ కూడా భారీ మొత్తాలు తీసుకున్నారన్న ప్రచారం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నప్పటికీ, వాటికి సంబంధించి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడి పేరు ప్రస్తావనకు రావడంతో మరో చర్చ కూడా మొదలైంది. ఎమ్మెల్యే పేరు, హోదాను ఎవరైనా ఉపయోగించుకున్నారా..? లేక ఇది పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో జరిగిన వ్యవహారమా..? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం , పరిచయాలను ఉపయోగించి ఉద్యోగాలకు సంబంధించిన హామీలు ఇచ్చారన్న ప్రచారంలో  ఎంత వాస్తవం అన్నది కూడా విచారణలోనే స్పష్టతకు రానుంది. బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా..? నగదు రూపంలో చెల్లింపులు జరిగాయా..? ఉద్యోగాల పేరుతో ఏమైనా పత్రాలు, వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్ రికార్డులు లేదా ఇతర ఆధారాలు ఉన్నాయా..? అన్న అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. మరికొందరు బాధితులు ఆధారాలతో ముందుకు వస్తారా..? పోలీసులకు ఫిర్యాదులు చేస్తారా..? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పోలీసుల సమగ్ర దర్యాప్తే కీలకంగా మారింది.

ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నిజంగానే లక్షల రూపాయలు వసూలు చేశారా..? మరికొందరి నుంచి కూడా డబ్బులు తీసుకున్నారా..? బాధితుడికి ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డర్ నిజమైనదేనా..? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది..? ఎమ్మెల్యే పేరు లేదా హోదా ఎక్కడైనా ఉపయోగించబడిందా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.

ప్రస్తుతం నమోదైన కేసు, బాధితుడి ఫిర్యాదు, వెలుగులోకి వచ్చిన ఆరోపణల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యే వరకు వాటిని ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడం మాత్రం భద్రాచలంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.