29 August, 2026 | 7:52 PM

జీసీసీ హమాలీల రేట్లు పెంచాలి: పిట్టల అర్జున్

29-08-2026 06:00 PM

దమ్మపేట, ఆగష్టు 29 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని జిసిసి కార్యాలయంలో శనివారం జిసిసి హమాలీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ జిసిసి హమాలీల ఎగుమతి దిగుమతి రేట్లు గత సంవత్సరం డిసెంబర్ తో ముగిసిందన్నారు. తదుపరి వేతన ఒప్పందం ఈ జనవరి లో సంబంధిత సివిల్ సప్లై అధికారులు, సంబదిత మంత్రి, హమాలి యూనియన్ నాయకులతో చర్చించి వేతన ఒప్పందం చేయడంలో తీవ్రమైన అలసత్వం వహించిన ఫలితంగా నేటి వరకు నూతన ఒప్పందం జరగలేదని అన్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాలకు, ఆశ్రమ హాస్టల్, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలు,  ప్రభుత్వ పాఠశాలలకు బియ్యం ఇతర నిత్యవసర సరుకులను చేరవేయడంలో జిసిసి హమాలీలు కీలక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. వీరికి సకాలంలో వేతన ఒప్పందాలు చేసి అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. జిసిసి హమాలీల నూతన ఒప్పందాలు చేయాలని పలుమార్లు సివిల్ సప్లై ఆఫీసులకు, సంబంధిత మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారని, కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసనలు తెలపటం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని ఎగుమతి, దిగుమతి, నూతన రేట్లు ప్రస్తుతం ఉన్న 29 రూపాయలు నుండి 40 రూపాయలకు పెంచి ఒప్పందం చేసుకొని వెంటనే అమలు చేయాలని అన్నారు. గత ఐదు ఒప్పందాలలో ప్రభుత్వ అధికారులు అంగీకరించిన ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు జిసిసి హమాలీలకు వర్తింపజేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, హమాలి యూనియన్ నాయకులు భోగ్యం సత్యం, నరసయ్య వీర్రాజు, వెంకట్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.