బీటీ3 విత్తనాలతో బురిడీ!
గడ్డి, రసం పీల్చే సమస్య ఉండదంటూ కుచ్చుటోపీ
ప్రభుత్వం నిషేధించినా దొడ్డిదారిన అమ్మకాలు
ఏపీ నుంచి సరఫరా
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 17 (విజయక్రాంతి): భూసారానికి ప్రమాదం ముంచుకొస్తుంది. ఇప్పటివరకు ప్రయోగ దశలో ఉండి దేశంలో నిషేధించిన బీటీ 3 (రౌండప్ రెడీఫ్టెక్స్ టెక్నాలజీ) విత్తనాలను జిల్లాలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఏపీ నుంచి సరఫరా అవుతున్న ఈ విత్తనాలు మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ కేంద్రంగా విక్రయిస్తున్నారు. బీటీ3 పత్తి విత్తనం వాడితే గడ్డి, రసంపీల్చే పురుగుల సమస్య ఉండదంటూ రైతులకు మాయమాటలు చెప్తున్నారు.
ప్రమాదకారిగా గుర్తింపు
కొంతమంది దళారులు రైతుల అమాయకత్వం, అవసరాలను ఆసరాగా చేసుకొని భూసారాన్ని పిప్పిచేసే బీటీ3 విత్తనాన్ని అంటగడుతున్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న బీటీ2 విత్తనాలు మొలకెత్తిన తర్వాత చుట్టుపక్కల కలుపు, గడ్డిని చంప డం కష్టతరంగా మారింది. బీటీ3 విత్తనాలు విత్తితే మొలకల మధ్య పెరిగే గడ్డిపై మం దు పిచికారీచేసినా పత్తి మొల క చనిపోదు. వీటిని మూడేళ్లు వినియోగిస్తే భూసారం కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇరవై ఏండ్లుగా..
బేసిల్లస్ తురంజెన్సీసిస్ (బీటీ) అనే విత్తనాలు 20 ఏళ్ల కిందట మార్కెట్‌లోకి వచ్చాయి. కొత్తలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. బీటీ మొక్కలను పంట చేతికొచ్చిన తర్వాత తిన్నప్పటికీ పశువులు చనిపోతాయని, వీటిని తరుచూ తాకితే రైతులకు రోగాలు వస్తాయనే వదంతు లు తలెత్తాయి. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతో రానురాను ఈ వంగడాలను అందరు వాడుతూ అధిక దిగుబడి పొందుతున్నారు. బీటీ విత్తనాలు కేవ లం పచ్చ, గులాబీ పురుగులను మాత్రమే తట్టుకోగలుగుతాయి. లద్దె పరుగు సమస్య అధికమైన తరుణంలో బీటీ2 విత్తనాలు వచ్చాయి. గడ్డి, రసం పీల్చే పురుగుల సమస్యను కూడా అధిగమించగలితే శక్తి బీటీ3కి ఉందంటూ దళారులు విక్రయిస్తున్నారు.
పడిపోతున్న నత్రజని శాతం
సారవంతమైన భూముల్లో 150 నుంచి 250 యూనిట్ల మేర నత్రజని శాతం ఉండాలి. కానీ, అనేక మండలాల్లో 120 యూనిట్లలోపు ఉంటోందని, దీంతోపాటు భాస్వరం, పొటాషియం సమస్య కూడా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. బీటీ3 విత్తనాలను పండిస్తే భవిష్యత్తులో పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఏజెంట్ల ద్వారా అమ్మకాలు
బీటీ౩ పత్తి విత్తనాలను అమ్మేందుకు దళారులు ఏజెంట్లను నియమించుకున్నారు. వారిద్వారా అమ్మకాలు జరుపుతున్నట్టు సమాచారం. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడ నమోదు కాలేదంటే దళారులు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం అవుతుంది. ఇటీవల జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి వీటి గురించి ప్రస్తావించడం చర్చనీయంశంగా మారింది.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టాం. అక్రమార్జనే ధ్యేయంగా కొంత మంది రైతులకు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలు అని చెప్పి రైతులకు అమ్మడంతో రైతులు నష్టపోతున్నారు. విత్తనాల ముఠాల బారిన పడకుండా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులతో కలసి సమన్వయంతో తనిఖీలు చేపడుతాం. రైతులు తీసుకుంటున్న విత్తనాలకు తప్పని సరిగ్గా బిల్లులు తీసుకోవాలి. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- సురేశ్‌కుమార్, ఎస్పీ, ఆసిఫాబాద్
బీటీ3 సాగు చేయొద్దు
ప్రభుత్వం నిషేధించిన బీటీ విత్తనాల సాగుతో రైతులు భవిషత్తులో ఇబ్బందులు పడే ప్ర మాదం ఉంది. ఈ విత్తనంతో ప్రజలకు ప్ర యోజనం ఉందని తెలిస్తే ప్రభుత్వమే ప్రోత్సహించేది. ఎక్కడైనా బీటీ3 విత్తనాలను విక్రయించినా కొనుగోలు చేయొద్దు. అమ్ముతున్నట్టు తెలిస్తే వ్యవసాయ అధికారులు, పోలీసులకు సమాచా రం ఇవ్వాలి. బీటీ విత్తనాలు అమ్మిన వారిపై కేసులు నమోదు చేస్తాం.
- వ్యవసాయాధికారి,ఆసిఫాబాద్






