నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు
23-05-2024 02:15 AM
ఖమ్మం పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ఖమ్మం, మే22 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ హెచ్చరించారు. నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయ, విత్తన కార్పొరేషన్, పోలీసు బలగాలతో జాయింట్ టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించినా, మధ్యవర్తుల ముసుగులో నకిలీ విత్తనాల విక్రేతలకు సహకరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వారిపై నిఘాపెట్టామని, తరచూ కేసులు నమోదైన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని చెప్పారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు దుకాణదారుల నుంచి రశీదు తీసుకోవాలని సూచించారు.






