21 August, 2026 | 8:21 PM

మేడిగడ్డకు సీడబ్ల్యూసీ బృందం

23-05-2024 03:40 AM

ప్రాజెక్టును పరిశీలించిన నిపుణులు

మేడిగడ్డ బరాజ్‌పై వంతెన కుంగిన ప్రాంతానికి సీడబ్ల్యూసీ బృందం సభ్యులు కాలి నడకన వెళ్లారు. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్స్‌ను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. 

జయశంకర్ భూపాలపల్లి, మే 22 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మిబరాజ్‌ను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం సందర్శించింది. బుధవారం ప్రాజెక్టుకు చేరుకున్న నిపుణుల బృందం.. ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బరాజ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ బరాజ్‌పై వంతెన కుంగిన ప్రాంతానికి సీడబ్ల్యూసీ బృందం సభ్యులు కాలి నడకన వెళ్లారు. ఏడో బ్లాక్‌లో దెబ్బతిన్న పియర్స్‌ను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.

బరాజ్‌లో ఆఫ్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్‌లో తిరిగి అణువణువునా పరిశీలించారు. మేడిగడ్డ బరాజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. బరాజ్‌లోని 15 నుంచి 21వ పియర్లు, గేట్ల వద్ద ఇసుక మేటలను, గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. సెంట్రల వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందంలోని జియో టెక్నికల్ ఇన్వెస్టి గేషన్ నిపుణులు, సైంటిస్ట్ జేఎస్ ఎడ్ల్‌బడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు, సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్‌నాయుడు, నానా డిస్ట్రిక్టీవ్ పరీక్ష నిపుణులు డాక్టర్ ప్రకాశ్ పాలే తదితరులకు పలు అంశాలపై సీఈ సుధాకర్ వివరించారు. లక్ష్మి బరాజ్ పరిశీలన అనంతరం నిపుణుల బృందం సరస్వతీ బరాజ్ పరిశీలనకు వెళ్లారు.