21 August, 2026 | 10:34 PM

ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ

21-08-2026 09:47 PM

తుంగతుర్తి (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త కవి పండితుడు జ్యోతిష సిద్ధాంతి పంచాంగ కర్త రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జడ్పిహెచ్ఎస్ పసునూరు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎర్ర హరి కిషన్  'ఎర్రన' అనే కలం పేరుతో సుమారు 20 పైగా రచనలు చేశారు. నాలుగు శతకాలు, రెండు ఖండకావ్యాలు కొన్ని పారాయణ గ్రంథాలు, మరికొన్ని విమర్శనాత్మకమైన విశ్లేషణాత్మకమైన గ్రంథాలను రచించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీశైల మాహాత్మ్యము పేరుతో ఆలయ చరిత్ర, చారిత్రక నేపథ్యం, భక్తుల విశ్వాసాలు, నమ్మకాలు, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి మహిమలు, శివదీక్షాపరుల విషయాలు, చెంచులు, కోయలు భక్తి ప్రపత్తులు, శ్రీ కృష్ణదేవరాయలు, శివాజీ, ప్రతాపరుద్రుడు లాంటి రాజులు కట్టించిన కట్టడాలు ఇత్యాది విషయాలతో పాటుగా సామాజిక సమస్యల్ని కూడా శివునికి నివేదించుకునే క్రమంలో 120  సీస పద్యాలతో "మళ్లీనాధ శతకం" రచించారు.

తేదీ: 23-08- 2026 ఆదివారం ఆలయ మర్యాదలతో శ్రీశైల క్షేత్రంలోని ధర్మపథం నందు పుస్తకావిష్కరణ జరుగుతున్నది. ఈ పుస్తకాన్ని శ్రీశైల మల్లికార్జున స్వామికే అంకితం ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రముఖ కవి సాహితీ విమర్శకులు డాక్టర్ ఈడికోజు శ్రీనివాస చారి  వ్యవహరించనుండగా ముఖ్యఅతిథిగా ప్రముఖ సాహితీ విమర్శకులు, కవి, సినిరంగ ప్రముఖులు, నాటక కర్త శ్రీ దోరవేటి  రానుండగా ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ యం. శ్రీనివాస్ రావు  విచ్చేస్తున్నారు.

మల్లినాథ శతకం తొలి ప్రతి ని మల్లికార్జున స్వామి వారి పేరుమీదుగా ఆలయ చైర్మన్ శ్రీ పోతుగంటి రమేశ్ నాయుడు  అందుకోనున్నారు. శ్రీశైల ప్రభ మాసపత్రిక ఎడిటర్ డాక్టర్ సి అనిల్ కుమార్  సబ్ ఎడిటర్ శ్రీ ఉన్నవ గణేష్  తుంగతుర్తి సాహితీ వేదిక అధ్యక్షులు శ్రీ గుండ గాని శ్రీనివాస్  ప్రముఖ కవి విమర్శకులు శ్రీ గడ్డం కృష్ణారెడ్డి, శ్రీ ఆలకుంట్ల లింగయ్య , శ్రీ ఎర్ర హరీష్ అగ్నిహోత్ర , శ్రీకృష్ణ సుధామ,  తదితరులు పాల్గొననున్నారు.