ట్రాఫిక్ కష్టాలకు చెక్!
పట్టాలెక్కిన హెచ్ సిటీ పనులు
రాబోయే 30 ఏళ్ల అవసరాలే లక్ష్యంగా ఐటీ కారిడార్‌లో సిగ్నల్ ప్రయాణం
కేబీఆర్ పార్కు చుట్టూ 1,090 కోట్లతో ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో రోజురోజు కూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేగవంతం చేసింది. ముఖ్యంగా నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని పలు ప్రధా న కూడళ్లలో రాబోయే 30 ఏళ్ల ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సిటీ పనులను పరుగులు పెట్టిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్‌ఆర్డీపీ 1, ఆ తర్వాత రూపొందించిన ఎస్‌ఆర్డీపీ-2 ప్రతిపాదనలకు అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యా యి. అయితే, ఎట్టకేలకు ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ప్రస్తుతం ఆయా ప్రాజెక్టులన్నీ హెచ్-సిటీ పేరిట పట్టాలెక్కాయి. కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు సుమారు రూ. 1090 కోట్ల భారీ వ్యయంతో ఏడు స్టీల్ ఫ్లైఓవర్లు, మరో ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు సాగుతున్నాయి.
పనుల కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్ సమీపంలో రూ.495 కోట్లతో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ విధానంలో రెండు ఫ్లైఓవర్లు, మరో రెండు అండర్‌పాస్‌ల నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి పనులు ఊపందుకున్నాయి.
ఈ జంక్షన్‌లో గచ్చిబౌలి నుంచి బీహెచ్‌ఈఎల్ వైపు, తిరిగి బీహెచ్‌ఈఎల్ నుంచి గచ్చిబౌలి వైపు రాకపోకలు సాగేందుకు వీలుగా రెండు ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. ఇదే జంక్షన్‌లో ట్రిపుల్ ఐటీ నుంచి డీఎల్‌ఎఫ్ వైపు ఒక అండర్పాస్, ట్రిపుల్ ఐటీ నుంచి ఐఎస్బీ వైపు మరో అండర్‌పాస్ పనులు మొదలయ్యాయి. కూకట్‌పల్లి వై జంక్షన్‌లో మూడు ఫ్లైఓవర్లను నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అమీర్‌పేట నుంచి వై జంక్షన్ వరకు తీవ్రమవుతున్న ట్రాఫిక్ రద్దీని, ఆ మార్గంలో ఇప్పటికే ఉన్న మెట్రో కారిడార్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు ఫ్లైఓవర్లను అత్యాధునికంగా డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 9,627 చదరపు గజాల స్థలాన్ని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. స్థలాలిచ్చే యజమానులకు టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నేరుగా నగదు రూపంలో నష్టపరిహారం చెల్లిస్తే స్థల సేకరణ ప్రక్రియ త్వరగా ముగుస్తుందని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులు ఇంత వేగంగా పట్టాలెక్కడం వెనుక జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రత్యేక చొరవ ఉంది.




