22 March, 2026 | 2:01 AM

ఖాజాగూడ హెరిటేజ్ రాక్‌కు మహర్దశ

22-03-2026 12:29 AM

పర్యాటక కేంద్రంగా మార్పు 

ప్రాచీన శిలల పరిరక్షణతో పాటు సరస్సుతో అనుసంధానం

హెచ్‌ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ శాఖల సమన్వయంతో బృహత్ ప్రాజెక్టు 

రాక్ గార్డెన్, ట్రెక్కింగ్ సెంటర్ అభివృద్ధికి సీఎంసీ కమిషనర్ మాస్టర్ ప్లాన్ 

హైదరాబాద్,సిటీ బ్యూరో మార్చి 21 (విజయక్రాంతి): నగరానికి తలమానికంగా ఉన్న ప్రాచీన శిలల పరిరక్షణకు, ఖాజాగూడ ప్రాం తాన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నడుం బిగించింది. ఐటీ కారిడార్ కు అతి సమీపంలో ఉన్న ఖాజాగూడ హెరిటేజ్ రాక్ అభివృద్ధిపై సీఎంసీ కమిషనర్ జి. సృజన ప్రత్యేక దృష్టి సారించారు.

శనివారం ఆమె శేరిలింగంపల్లి జోన్ కమిషనర్, నార్సింగి , శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్లతో కలిసి ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సేవ్ ది రాక్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి రాక్ వాక్ నిర్వహించి, ఇక్కడి శిలల చారిత్రక ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నా రు. ఖాజాగూడ శిలలను కేవలం సంరక్షించడమే కాకుండా, వాటిని నగరవాసులకు ఒక పర్యాటక వేదికగా మార్చాలని కమిషనర్ నిర్ణయించారు.

ఈ ప్రాంతాన్ని ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలకు కేంద్రంగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో చర్చించారు. నగరంలో పెరుగుతున్న కాంక్రీట్ అడవి మధ్య ఖాజాగూడ శిలలు, ఇక్కడ పచ్చదనంతో కూడిన అత్యాధునిక రాక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఖాజాగూడ సరస్సును, శిలల ప్రాంతాన్ని అనుసంధానం చేయాలని కమిషనర్ ఆదేశించారు. శిలల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. 

మోడల్ హెరిటేజ్ సైట్‌గా.. 

హెచ్‌ఎండీఏ, హైడ్రా, సీఎంసీ సంస్థలు సమన్వయంతో పనిచేసి ఈ ప్రాంతాన్ని ఒక మోడల్ హెరిటేజ్ సైట్‌గా మార్చాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సందర్శకులకు అవసరమైన కనీస వసతులు కల్పిస్తూనే, శిలల సహజత్వాన్ని దెబ్బతీయకూడ దని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాంతా భివృద్ధికి సంబంధించి భూమి వివరాలు, భౌగోళిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని కమిషనర్ సూచించారు.

అవసరమైన అనుమతుల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో, రెవెన్యూ శాఖతో నిరంతరం సమన్వ యం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖాజాగూడ శిలల ప్రత్యేకతలను వివరిస్తూ సేవ్ ది రాక్స్ సభ్యులు సంగీత, రుత్విక్ అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తుది ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని కమిషనర్ సృజన స్పష్టం చేశారు.