జడేజా మాయాజాలం..

06-05-2024 02:43:57 AM

పంజాబ్‌పై చెన్నై విజయం

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన జడ్డూ

ప్లేఆఫ్‌కు చెన్నై చేరువ

ప్లేఆఫ్ రేసు రసవత్తరంగా మారుతున్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి జూలు విదిల్చింది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడిచిన మ్యాచ్‌లో చెన్నైనే విజయం వరించింది. జడేజా అన్నీ తానై జట్టుకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. గత రెండు మ్యాచ్‌ల్లో భారీ లక్ష్యాలను అవలీలగా చేధించిన పంజాబ్ చెన్నైతో మ్యాచ్‌లో తడబడి ఓటమిని కొనితెచ్చుకుంది. మ్యాచ్ విజయంతో చెన్నై ప్లేఆఫ్‌కు మరింత చేరువ కాగా.. పంజాబ్ మాత్రం ఓటమితో అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.

ధర్మశాల: ఐపీఎల్ 17వ సీజన్‌లో సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన పరాభవానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన మ్యాచ్‌లో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి చెన్నైకి విజయాన్ని అందించాడు. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డారిల్ మిషెల్ (19 బంతుల్లో 30, 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32, 4 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చహర్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనలో పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమితమైంది. ప్రబ్‌సిమ్రన్ (23 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. శశాంక్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) పర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జడేజా 3 వికెట్లతో చెలరేగగా.. తుషార్ దేశ్‌పాండే, సమర్‌జీత్‌లు చెరో 2 వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నైను గెలిపించిన జడేజా ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. పంజాబ్‌పై విజయంతో చెన్నై 12 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. లీగ్‌లో భాగంగా సోమవారం ముంబై, హైదరాబాద్‌లు తలపడనున్నాయి.

స్కోరు వివరాలు

చెన్నై: రహానే (సి)రబాడ (బి) అర్షదీప్ 9, రుతురాజ్ (సి) జితేశ్ (బి) రాహుల్ చహర్ 32, మిషెల్ (ఎల్బీ) హర్షల్ 30, దూబే (సి) జితేశ్ (బి) రాహుల్ చహర్ 0, మోయిన్ అలీ (సి) బెయిర్ స్టో (బి) సామ్ కరన్ 17, జడేజా (సి) సామ్ కరన్ (బి) అర్షదీప్ 43, సాంట్నర్ (సి) సామ్ కరన్ (బి) రాహుల్ చహర్ 11, శార్దూల్ (బి) హర్షల్ 17, ధోనీ (బి) హర్షల్ పటేల్ 0, తుషార్ (నాటౌట్) 0, రిచర్డ్ గ్లెసన్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 167/9. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 9 బౌలింగ్: రబాడ 3 అర్షదీప్ 4 సామ్ కరన్ 4 హర్‌ప్రీత్ బ్రార్ 1 రాహుల్ చహర్ 4 హర్షల్ పటేల్ 4

పంజాబ్: ప్రబ్‌సిమ్రన్ (సి) సమీర్ రిజ్వీ (బి) జడేజా 30, బెయిర్ స్టో (బి) తుషార్ 7, రొసౌ (బి) తుషార్ 0, శశాంక్ (సి) సిమర్‌జీత్ సింగ్ (బి) సాంట్నర్ 27, సామ్ కరన్ (సి) సాంట్నర్ (బి) జడేజా 7, జితేశ్ శర్మ (సి) ధోనీ (బి) సిమర్‌జీత్ 0, అశుతోశ్ (సి) సిమర్‌జీత్ (బి) జడేజా 3, హర్‌ప్రీత్ (నాటౌట్) 17, హర్షల్ పటేల్ (సి) సమీర్ రిజ్వీ (బి) సిమర్‌జీత్ 12, రాహుల్ చహర్ (బి) శార్దూల్ 16, రబాడ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 139/9. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 9 సాంట్నర్ 3 తుషార్ 4 రిచర్డ్ గ్లీసన్ 4 జడేజా 4 సిమర్‌జీత్ 3 శార్దూల్ 2