ముంబై x హైదరాబాద్

06-05-2024 02:44:13 AM

ముంబై: ఐపీఎల్లో రెండు వరుస పరాజయాలతో ప్లేఆఫ్ రేసులో వెనుకబడినట్లు కనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం సాధించి మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తోంది. సీజన్‌లో భాగంగా నేడు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా హైదరాబాద్ బరిలోకి దిగుతుంది. సీజన్‌లో హైదరాబాద్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇక ముంబై ఆడిన 11 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు చేస్తూ ప్రత్యర్థులను భయపెట్టిన రైజర్స్ గత మూడు మ్యాచ్‌లుగా మాత్రం స్కోర్లు చేయడంలో విఫలమవుతోంది. ముఖ్యంగా ఛేదనలో తడబడుతున్న ఆ జట్టుకు ముంబైతో మ్యాచ్ కీలకంగా మారింది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ముంబైకి ప్లేఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినప్పటికి విజయాలు సాధించి ప్రత్యర్థుల ఆశలను గల్లంతు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైజర్స్ బ్యాటింగ్ విభాగానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు శుభారంభాలు అందిస్తున్నారు. ఆ తర్వాత వస్తున్న క్లాసెన్ జోరు తగ్గినప్పటికి తన విధ్వంసం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక రాజస్థాన్‌తో మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్‌లు లోయర్ ఆర్డర్‌లో ఉపయుక్తంగా ఆడుతున్నారు.

బౌలింగ్‌లోనూ కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్, మయాంక్ మార్కండేలతో పటిష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగుతో గెలిచినప్పటికి బౌలర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక ముంబై బ్యాటింగ్ మాత్రం తీసికట్టుగా తయారైంది. రోహిత్ శర్మ, ఇషాన్‌లు ఫామ్ కోల్పోయి అవస్థలు పడుతున్నారు. సూర్య రాణిస్తున్నప్పటికి భారీ స్కోర్లు బాకీ ఉన్నాయి. తిలక్ వర్మ మెరుస్తున్నాడు. కెప్టెన్ పాండ్యా ప్రదర్శన మాత్రం ఘోరంగా తయారైంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్నాడు. ముంబై బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నువాన్ తుషారా ఆరంభంలోనే వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక బుమ్రా, కోట్జీలు నిలకడగా రాణిస్తూ వికెట్లు పడగొడుతున్నారు.