ఎక్స్‌పైర్ అయిన క్లోరోఫిన్ టాబ్లెట్లు.. చిన్నారి మృతి
పోలవరం జిల్లా: ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మలేరియా నివారణలో భాగంగా గ్రామస్థులకు పంపిణీ చేసిన టాబ్లెట్లు వేసుకున్న తర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఓ ఏడేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామంలో మలేరియా ఉందన్న సమాచారంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పాఠశాల విద్యార్థులతో పాటు గ్రామస్థులకు మలేరియా వైద్య బృందం క్లోరోక్విన్ టాబ్లెట్లు(Chlorphen tablets) పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఆ టాబ్లెట్లు ఎక్స్‌పైర్ అయినవిగా ఉన్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
టాబ్లెట్లు(tablets)తీసుకున్న అనంతరం సుమారు 75 నుంచి 100 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. పరిస్థితి విషమించడంతో పలువురిని ట్రాక్టర్ల ద్వారా ఎటపాక మండలం లక్ష్మీపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యుల కొరత ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రస్తుతం పలువురు చిన్నారులకు భద్రాచలం(Bhadrachalam) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నలుగురు చిన్నారులకు చికిత్స కొనసాగుతుండగా.. వారిలో మడివి జమున అనే ఏడేళ్ల బాలిక చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన పద్దం రోజా అనే బాలిక కూడా కొద్ది రోజుల క్రితం మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నిన్న నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోవడంతో వారిని హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన పిల్లలందరినీ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఒకేసారి పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో గొల్లగుప్ప గ్రామంలో ఆందోళన నెలకొంది. టాబ్లెట్ల పంపిణీ, వాటి గడువు, అస్వస్థతకు కారణాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి మృతి, పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై పోలవరం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎక్స్‌పైరీ మందులు పంపిణీ చేశారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






