అప్పుల బాధతో సింగరేణి ఓవర్‌మెన్ ఆత్మహత్య
రామగిరి,సెప్టెంబర్ 1(విజయ క్రాంతి): అప్పుల బాధ భరించలేక మనస్థాపానికి గురైన సింగరేణి ఉద్యోగి(Singareni employee) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం రాత్రి భూపాలపల్లి జిల్లా(Bhupalpally District) మల్హర్ మండలం కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ వద్ద చోటుచేసుకుంది. అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో ఓవర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బత్తుల కృష్ణచైతన్య(32) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సెంటినరీ కాలనీలోని సీ-2/127 క్వార్టర్‌లో నివాసం ఉంటుండగా, ఆయన స్వస్థలం మణుగూరు. ఆత్మహత్యకు పాల్పడటానికి కొద్దిసేపటి ముందు కృష్ణచైతన్య తన భార్య పద్మావతితో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
అనంతరం కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ వద్దకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కృష్ణచైతన్య కొంతకాలంగా ఆర్థిక సమస్యల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఆత్మహత్యకు గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, సింగరేణి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






